KTR: చెరిపేస్తే చరిత్ర చెరిగిపోదు.. దాచేస్తే నిజాలు దాగవు: కేటీఆర్ సెన్సేషనల్ ట్వీట్
రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు తెలంగాణ సర్కార్ నూతన ఎంఎస్‌ఎంఈ (MSME) పాలసీ-2024ను ప్రకటించింది.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు తెలంగాణ సర్కార్ నూతన ఎంఎస్‌ఎంఈ (MSME) పాలసీ-2024ను ప్రకటించింది. సమగ్ర అధ్యయనంతో ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం పనితీరు ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కూడా ప్రకటించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంఎస్ఎంఈ పాలసీతో సాధించిన పారిశ్రామిక వృద్ధిపై తన ‘X’ (ట్విట్టర్) ఖాతాలో ట్వీట్ చేశారు.
కేసీఆర్ (KCR) హయాంలో పరుగులు పెట్టిన పారిశ్రామిక ప్రగతి గురించి కాంగ్రెస్ (Congress) అధికారికంగా ఒప్పుకుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ (BRS) సర్కార్ హయాంలో గత పదేళ్లలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) వృద్ధి రేటు 11 శాతం నుంచి 15 శాతం పెరిగిందని తెలిపారు. 2018-2023 మధ్యలో టీఎస్ ఐపాస్ (TS IPASS) ద్వారా పెరిగిన సగటు పెట్టుబడి 115 శాతంగా ఉందన్నారు. ఇక జీఎస్డీపీలో ఎంఎస్ఎంఈ (MSME)ల వాటాలో వృద్ధి 10 శాతంగా ఉందని, రాష్ట్రంలో ప్రతి ఏటా పెరిగిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంఖ్య 15 శాతం అని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈల్లో పెరిగిన ఉపాధి శాతం 20 శాతం వృద్ధి రేటు ఉందన్నారు.
ఎంఎస్ఎంఈల్లో 30 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ మహిళలు ఉద్యోగాలను పొందారని గుర్తు చేశారు. 2020-2023 మధ్యలో అతి తక్కువ ఎంఎస్ఎంఈలు మూసిపడిన రాష్ట్రంగా తెలంగాణ (Telangana State) నిలిచిందని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ (TS IPASS) వంటి ప్రగతిశీల విధానాలు, చిన్న పరిశ్రమలకు ఇచ్చిన ప్రోత్సాహకాలతోనే ఇలా అద్భుత ప్రగతి ఆవిష్కృతమైందని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌ను దుర్భాషలాడి నిజాలను దాయలేదని. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత నిజమో.. కేసీఆర్ గారు తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాడన్నది అంతే నిజమని కేటీఆర్ (KTR) ట్వీట్ చేశారు.