ఎగ్జామ్ బాగా రాయలేదని సూసైడ్ చేసుకున్నాడు.. కానీ టాప్ మార్కులతో ఏ గ్రేడ్ తెచ్చుకున్నాడు
ఇంటర్ పరీక్షలు బాగా రాయలేకపోయాననే బాధతో గత నెల 10న ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. కానీ ఆ యువకుడికి ఇవాళ విడుదలైన ఇంటర్ ఫలితాలలో టాప్ మార్కులు వచ్చాయి.
దిశ, వెబ్ డెస్క్: ఇంటర్ పరీక్షలు బాగా రాయలేకపోయాననే బాధతో గత నెల 10న ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. కానీ ఆ యువకుడికి ఇవాళ విడుదలైన ఇంటర్ ఫలితాలలో టాప్ మార్కులు వచ్చాయి. దీంతో ‘ బిడ్డా.. లేని పోని అనుమానంతో ప్రాణాలు తీసుకుంటివి.. ఇయ్యాల ఇన్ని మార్కులతో పాసైతివి’’ అంటూ ఆ విద్యార్థి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పిక్షా తండా శివారు బోడగుట్ట తండాకు చెందిన గుగులోతు కృష్ణ (19) ఇంటర్ పరీక్షలు బాగా రాయలేకపోయాను అంటూ లేఖ రాసి గత నెల 10న ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కానీ ఇవాళ విడుదలైన ఇంటర్ ఫలితాల్లో కృష్ణ బైపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 892 మార్కులతో ఏ గ్రేడ్ సాధించాడు. కొడుకుకు టాప్ మార్కులు వచ్చాయనే విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు.. తమ కొడుకు పరీక్షలో పాసయ్యాడని కానీ జీవితంలో ఫెయిల్ అయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ పరీక్షలో తక్కువ మార్కులు వస్తాయనే భయంతో తన కుమారుడు చనిపోయాడని, కానీ ఇవాళ ఏ గ్రేడ్ సాధించాడని కన్నీరుమున్నీరు అయ్యారు. ఇక తల్లిదండ్రుల రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. పరీక్షా ఫలితాలు వచ్చే దాక ఆగితే కృష్ణ ఆగితే ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలేది కాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.