గాంధీ భవన్‌లో అనూహ్య పరిణామం.. రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ!
టీకాంగ్రెస్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దాదాపు ఏడాది తర్వాత ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గాంధీ భవన్ మెట్లు ఎక్కారు.
దిశ,డైనమిక్ బ్యూరో: టీకాంగ్రెస్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దాదాపు ఏడాది తర్వాత ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గాంధీ భవన్ మెట్లు ఎక్కారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ ఛార్జి మాణిక్ రావు థాక్రే శుక్రవారం తెలంగాణకు వచ్చారు. ఈ సందర్భంగా ముఖ్య నేతలతో ఆయన భేటీ అయ్యారు. పార్టీ పరిస్థితులు, హాథ్ సే హాత్ జోడో కార్యక్రమంపై ఆయన నేతలతో చర్చించారు. అయితే ఈ సమావేశానికి రావాల్సిందిగా పీసీసీ కార్యాలయం నుంచి కోమటిరెడ్డికి ఫోన్ వెళ్లింది. దీంతో సుదీర్ఘ కాలం తర్వాత వెంకట్ రెడ్డి గాంధీ భవన్ మెట్లెక్కారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి మాట్లాడుకున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య మాటలేక కాదు కనీసం చూపులుకు కూడా కలవడం లేదు.
ఇకపై గాంధీ భవన్ మెట్లు ఎక్కబోయేది లేదని గతంలో వెంకట్ రెడ్డి శపథం చేశారు. అలాంటిది అనూహ్యంగా వీరిద్దరు గాంధీ భవన్‌లో కలిసి మాట్లాడుకోవడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. అయితే థాక్రే తొలిసారి రాష్ట్రానికి వచ్చినప్పుడు వెంకట్ రెడ్డి గాంధీభవన్‌కు రాలేదు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోనే ఇన్ ఛార్జితో సమావేశం అయి పార్టీ పరిస్థితులతో పాటు రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరిగింది. అయితే కొత్త ఇన్ ఛార్జి నిర్ణయాల నేపథ్యంలో వెంకట్ రెడ్డి తన శపథాన్ని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. రేవంత్‌తో భేటీ అయిన వెంకట్ రెడ్డి ఇన్ ఛార్జి థాక్రేతోనూ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా వీరి మధ్య ఎలాంటి చర్చలు జరగబోతున్నాయనేది ఆసక్తిగా మారింది. అయితే గత కొంత కాలంగా కోమటిరెడ్డి బీజేపీకి కోవర్ట్ అనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన తిరిగి గాంధీ భవన్ మెట్లు ఎక్కడం, రేవంత్‌తో భేటీ కావడంతో రాష్ట్ర రాజకీయం మరింత ఆసక్తిగా మారుతోంది.
అలిగి వెళ్లిన వీహెచ్
థాక్రే రాకతో గాంధీ భవన్‌లో సందడి వాతవరణం నెలకొనగా అంతలోనే అక్కడ నేతల మధ్య గలాటా సంచలనంగా మారింది. తాను పెట్టిన క్రికెట్ టోర్నీకి థాక్రేను రావాలని వీహెచ్ ఆహ్వానించారు. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా రాలేనని థాక్రే బదులు ఇచ్చారు. దీంతో అలిగిన వీహెచ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో మహేష్ కుమార్ గౌడ్, వీహెచ్‌కు మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది.