Komati Reddy: మదర్ డెయిరీకి పునర్వైభవం.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
మదర్ డెయిరీ చైర్మన్ గా గుడిపాటి మధుసూదన్ రెడ్డి సహా ఇతర సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: మదర్ డెయిరీ చైర్మన్ గా గుడిపాటి మధుసూదన్ రెడ్డి సహా ఇతర సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సహా పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం(నార్ముల్) చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గుడిపాటి మధుసూదన్ రెడ్డి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. హయత్‌నగర్ లోని నార్ముల్ మదర్ డెయిరీ కార్యాలయంలో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. మధుసూదన్ రెడ్డి ఈ పదవిలో ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. ఆయనతో పాటు ఎన్నికైన ఇతర సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. నార్ముల్ మదర్ డెయిరీ చైర్మెన్ గా ప్రమాణ స్వీకారం చేసిన గుడిపాటి మధుసూదన్ రెడ్డితో పాటు ఇతర సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ముఖ్యమంత్రితో చర్చించి మదర్ డెయిరీ కి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అలాగే ఆలయాలు, ప్రభుత్వ స్కూల్స్, హాస్టల్స్ కు మదర్ డెయిరీ పాలు సరఫరా అయ్యేలా చర్యలు చేపడతామని అన్నారు. మదర్ డెయిరీని లాభాల బాటలోకి తీసుకురావాలని చెబుతూ.. పాలకవర్గం, ఉద్యోగులు టీమ్ వర్క్‌గా పనిచేస్తేనే మదర్ డెయిరీ లాభాల బాటలో వెళ్తుందని సూచించారు. ఇక మదర్ డెయిరీకి పునర్వైభవం వచ్చేలా కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.