తౌటోని‌కుంట చెరువు పున‌రుద్ధర‌ణ‌కు చ‌ర్యలు.. భగీరథమ్మ చెరువకు కాలువ ఏర్పాటు

చెరువుల్లో ఆక్రమణలను తొలగించిన హైడ్రా వాటిని పునరుద్ధరించడానికి సైతం చర్యలు ప్రారంభించింది.

Update: 2024-10-31 01:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: చెరువుల్లో ఆక్రమణలను తొలగించిన హైడ్రా వాటిని పునరుద్ధరించడానికి సైతం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగానే ఔట‌ర్ రింగురోడ్డుకు చేరువ‌లోని నాన‌క్‌రామ్‌గూడ చౌర‌స్తా ఖాజాగూడ‌లోని తౌటోని కుంటను బుధ‌వారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంద‌ర్శించారు. చెరువు పున‌రుద్ధర‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్యల‌పై రెవెన్యూ, ఇరిగేష‌న్‌, జీహెచ్‌ఎంసీ అధికారుల‌తో స‌మీక్షించారు. ప‌రిస‌ర ప్రాంతాల నుంచి చెరువుకు నీరు చేరే మార్గాల‌ ప‌రిశీలించారు.

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్డు యూనివర్సిటీ ఖాళీ స్థలంలో వ‌ర్షపు నీరు నిల‌వ‌డంతో ఆ ద‌గ్గర‌లోని అపార్టుమెంట్ల సెల్లార్‌ల‌లోకి నీరు వ‌చ్చి చేరుతోంద‌ని స్థానికుల ఫిర్యాదు చేశారు. దీంతో పాటు యూనివ‌ర్సిటీ ఖాళీ స్థలంలో నుంచి వ‌ర‌ద నేరుగా తౌటోని కుంటకు చేరితే ఈ ఇబ్బంది ఉండదని స్థానికులు హైడ్రా కమిషనర్‌కు వివరించారు. యూనివ‌ర్సిటీ ఖాళీ స్థలంలోని వ‌ర‌ద నీరు సుల‌భంగా కాలువ ద్వారా చెరువులోకి చేరేలా చ‌ర్యలు తీసుకోవాల‌ని సంబంధిత శాఖల అధికారులకు హైడ్రా కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. తౌటోని కుంట నిండితే ఆ నీరు నేరుగా భ‌గీర‌ధ‌మ్మ చెరువుకు చేరేలా కాలువ ఏర్పాటు చేయాలంటూ అధికారుల‌కు సూచించారు. నివాసాల మ‌ధ్య ఉన్న చెరువుల పున‌రుద్ధర‌ణ‌పై హైడ్రా దృష్టి పెట్టింద‌ని, ముందుగా వాటి ఎఫ్‌టీఎల్ నిర్ధారించేందుకు చ‌ర్యలు తీసుకుంటున్నామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ తెలిపారు.

ట్రాఫిక్ స‌హాయ‌కులుగా హైడ్రా వలంటీర్లు..

న‌గ‌రంలో ట్రాఫిక్ నియంత్రణ‌లో ట్రాఫిక్ పోలీసుల‌కు స‌హ‌క‌రించేందుకు బుధ‌వారం హైడ్రా ట్రాఫిక్ వలంటీర్లు రంగంలోకి దిగారు. మొద‌టి విడ‌త‌గా శిక్షణ పూర్తి చేసుకున్న 50 మంది హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది న‌గ‌రంలోని ముఖ్యమైన కూడ‌ళ్లలో ట్రాఫిక్ విధులు నిర్వహించారు. హైడ్రా ట్రాఫిక్ వలంటీర్ పేరిట రేడియం జాకెట్లు వేసుకుని విధుల్లో పాల్గొన్నారు.


Similar News