అది నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్‌ను నేను ఏం అనలేదు.. ఒక్క మాట అనలేదు..

Update: 2022-03-12 13:40 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్‌ను నేను ఏం అనలేదు.. ఒక్క మాట అనలేదు.. సీఎం ఆరోగ్యం గురించి ప్రస్తావించలేదు.. మీడియా వాళ్లు కేసీఆర్‌కు హెల్త్‌ బాగోలేదని చెబితే.. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసి ఏమో అని మాత్రమే అన్నానని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. సింగరేణిపై మాట్లాడిన మాటకు కట్టుబడి ఉన్నానని ప్రకటించారు. నైని కోల్ బ్లాక్ లో నాణ్యమైన బొగ్గు ఉందని డిమాండ్ ఉంటుందన్నారు. ఆదాయం వచ్చే నైని కోల్ బ్లాక్ టెండర్ ను పారదర్శంగా చేపట్టలేదని ఆరోపించారు. టెండర్ లో ఎక్కువ కంపెనీలు పాల్గొనకుండా అనుకూలమైన వారు కొందరే పాల్గొనేలా కుట్రలు చేశారన్నారు. 25 ఏళ్లు బొగ్గుగనుల టెండర్లు పిలువడం అన్యాయమన్నారు. సింగరేణిని దోచుకుంటున్నారని మండిపడ్డారు. సింగరేణిని కేసీఆర్ కాపాడుతున్నారని టీఆర్ఎస్ నేతలు పేర్కొనడం తప్పు అన్నారు. సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరణ చేయదని, ఆధీనంలోకి తీసుకోదన్నారు. నైని కోల్ బ్లాక్ టెండర్ తో సింగరేణికి 25వేల కోట్ల ఆదాయానికి గండిపడుతుందన్నారు. టెండర్ లో గోల్ మాల్ జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. టెండర్ లో గోల్ మాల్ జరగలేదని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.

తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పాలకులు అన్యాయం చేస్తున్నారని చెప్పిన కేసీఆర్... ఇప్పుడు దోచుకుంటున్నారని, ఫిలింసిటీని లక్ష నాగళ్లతో దున్నుతానని ప్రకటించిన మాట ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణ అన్యాయంపై 14 ఏళ్లు పాటపాడారని, వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 2014 నుంచి ఇప్పటివరకు వరకు 8 ఏళ్లలో కేసీఆర్ పక్కన ఉండి భూములు, కాంట్రాక్టులు తీసుకొని కోట్లు సంపాదించింది ఎవరు?. సీమాంధ్ర కాంట్రాక్టర్లా? తెలంగాణ కాంట్రాక్టర్లా? సీమాంధ్ర పట్టుబడిదారులా? గుండెమీద చేయ్యి వేసుకొని చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పడు దోపిడీ జరిగింది వారి వల్లనేనని, ఇప్పుడు తెలంగాణ సంపద దోచుకుంటుంది... అప్పుల పాలు చేసింది కూడా సీమాంధ్ర పెట్టుబడిదారులు, కాంట్రాక్టులు కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తర్వాత మీ కుటుంబం బాగుపడ్డది... టీఆర్ఎస్ నాయకులు బాగుపడ్డారు... టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు తప్పితే పేదలకు లాభం జరుగలేదన్నారు. పెన్షన్లు, రైతు బంధును జేబులకెల్లి ఇస్తలేరని... హైదరాబాద్ ఆదాయంతో ఇస్తున్నారన్నారు. హైదరాబాద్ తో కూడిన తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చింది... కాబట్టే ఆదాయం ఆదాయం వస్తుందన్నారు.

Tags:    

Similar News