తెలంగాణతో KCR పేగు బంధం తెగిపోయింది : KodandaRam
టీఆర్ఎస్ పేరును వదులుకోవడం అంటే అమరవీరులను అవమానించడమే అని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ.కొదండరాం అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: టీఆర్ఎస్ పేరును వదులుకోవడం అంటే అమరవీరులను అవమానించడమే అని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ.కొదండరాం అన్నారు. అమరవీరుల బాధ్యత వదులుకోవడం కోసమే టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చారని తెలంగాణతో కేసీఆర్ పేగు బంధం తెగిపోయిందన్నారు. తెలంగాణ రైతులకు న్యాయం చేయలేని కేసీఆర్ దేశంలో రైతులను ఏం ఉద్దరిస్తారని ప్రశ్నించారు. రైతు బీమా తప్ప రైతులకు మరే సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. బీఆర్ఎస్ వద్ద ఎలాంటి కొత్త ఆలోచనలు లేవని వారి వద్ద ఉన్నదల్లా నియంతృత్వం, అవినీతి ఆలోచనలే అని విమర్శించారు.
శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు లో రూ.30 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. తెలంగాణ పేరు మర్చారంటే తల్లి ఇచ్చిన పేరును వదులుకోవడమే అన్నారు. ఇకపై తెలంగాణ గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్‌కు లేదన్నారు. ఆంధ్ర ఉద్యోగుల కోసం తెలంగాణ ఉద్యోగులకు డిమోషన్ ఇచ్చారని మండిపడ్డ కోదండరాం.. ఢిల్లీ లిక్కర్ స్కాంతో కేసీఆర్ కుటుంబం అంటే ఏంటో తేలిపోయిందన్నారు. తెలంగాణ బచావ్ పేరుతో ఉద్యమకారుల సదస్సులను నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు.