తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు.. కేసీఆర్‌కు కోదండరాం బహిరంగ లేఖ

దిశ, తెలంగాణ బ్యూరో: ఎనిమిదేళ్ల కాలంగా అమరుల త్యాగాలను ఉద్యమ ఆకాంక్షలను మరిచి తెలంగాణ ప్రజలను వంచించి..latest telugu news

Update: 2022-06-05 16:58 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఎనిమిదేళ్ల కాలంగా అమరుల త్యాగాలను ఉద్యమ ఆకాంక్షలను మరిచి తెలంగాణ ప్రజలను వంచించి కుటుంబ ప్రయోజనాల కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న సీఎం కేసీఆర్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు పూరైనా సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాల‌పై తెలంగాణ జనసమితి చేపట్టిన ఆత్మ గౌరవ దీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. దశాబ్దాల పాటు సాగిన తెలంగాణ ఉద్యమ తొలి మలి దశలో వేలాది మంది అమరత్వం పునాది మీద రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. సీమాంధ్ర పెట్టుబడిదారి రాజకీయ నాయకత్వం రాష్ట్రాన్ని రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, చేస్తున్న దోపిడీని అర్థం చేసుకొని సకలజనుల మేకమై కొట్లాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ఏ కారణాల రీత్యా రాష్ట్ర ఉద్యమంలోకి నెట్టబడినా ఎన్నో అనుమానాలతో తెలంగాణ సమాజం కేసీఆర్‌ను కూడా దరిన చేర్చుకుందని, ఉద్యమంలో భాగస్వామ్యం చేసిందని, అగ్రభాగాన నిలబెట్టిందన్నారు. ఎన్నో ఆశలతో పాలన అవకాశం ఇస్తే నమ్మి నాని పోస్తే పుచ్చి బుర్రలైనట్లు తెలంగాణ సమాజం కళలను నీరు గారుస్తు కేసీఆర్ గత ఎనిమిది సంవత్సరాలుగా నిరంకుశ పాలన సాగిస్తున్నారని అన్నారు.

ఒకవైపు నీళ్లు, నిధులు నియామకాలు ప్రధాన ట్యాగ్ లైన్‌గా ఉద్యమం సాగించి స్వరాష్ట్రం సాధించామని గుర్తు చేశారు. ఆ నీళ్లను కూడా తాను గందరగోళం చేశారని అన్నారు. త్రాగు, సాగునీటి ప్రజెక్టుల రీడిజైనింగ్ పేరుతో కమిషన్‌లే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించి కాలువల్లో నీళ్లకు బదులు అవినీతి డబ్బులు పారించారని తెలిపారు. రాష్ట్ర ఎడారిగా మారే పరిస్థితి ఏర్పడిందన్నారు. జలాలపై కేంద్రం గెజిట్ తెచ్చిన కేసీఆర్ మౌనంగా ఉన్నారని అన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని అన్నారు. రిజర్వు బ్యాంకు దయతలిస్తే నో, మద్యం అమ్మకాలు పెరిగితే‌నో తప్ప, జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకువచ్చారని అన్నారు. చివరికి పెన్షనర్‌లకు సైతం సకాలంలో ఇవ్వడంలో విఫలమయ్యారని తెలిపారు. ఎండమావి లాంటి ప్రాజెక్టుల నిర్మాణం భ్రమలో ముంచి వ్యవసాయ రంగాన్ని ఆదిలోనే ధ్వంసం చేశారని ఆరోపించారు. సీఎం విధానాల మూలంగా నాలుగు వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. రైతుబంధు చూపించి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

ఉద్యోగ నియామకాలు ప్రధాన ఎజెండాగా సాగిన ఉద్యమ మౌలిక ఆకాంక్షను నిర్లక్ష్యం చేస్తూ ఇదిగో నోటిఫికేషన్లు అదిగో నోటిఫికేషన్లు అంటూ కాలయాపన చేయడం మూలంగా వందలాది నిరుద్యోగ యువకులు ఆత్మ హత్యలకు పాల్పడింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. విద్యారంగ అభివృద్ధికి అడుగులు వేయకపోగా ఉన్న నిధులను తగ్గించారని తెలిపారు. అక్కడక్కడ గురుకుల పాఠశాలలను చూపిస్తూ వేలాది పాఠశాలలను మూసివేశారని తెలిపారు. మన ఊరు- మన బడి అంటూ ప్రైవేటు వ్యక్తుల నుంచి విరాళాలు వసూలు చేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయుల మీద ఒత్తిడి పెంచుతూ ప్రభుత్వ విద్యను చులకన చేశారని పేర్కొన్నారు. వైద్య రంగాన్ని, ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసారన్నారు. 317 జీవోను తీసుకువచ్చి తెలంగాణ భూమి పుత్రుల స్థానిక ప్రశ్నార్థకం చేశారని అన్నారు. భూసేకరణ చట్టం 2013 కు తూట్లు పొడుస్తూ అడ్డగోలు భూసేకరణ చేస్తున్నారని అన్నారు. మహిళా సాధికారతను గాలికొదిలి మహిళా రక్షణలో దారుణంగా విఫలమైందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించిన సీఎం డబ్బు మైకంలో రాష్ట్రాన్ని మద్యానికి, మాదకద్రవ్యాలకు అడ్డాగా మార్చారన్నారు. నేర నియంత్రణలో విఫలమయ్యారని అన్నారు. సీఎంగా అన్ని రంగాల్లో విఫలం చెందారని, తెలంగాణను పాలించే అర్హతను కోల్పోయారని లేఖలో పేర్కొన్నారు.


Similar News