గుండెల మీద టన్నుల బరువు పోయి.. తెలంగాణ ఊపీరి పీల్చుకుంది: ప్రొ. కోదండరామ్
నాయకుల దోపిడీ, అవినీతి వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు అసంతృప్తి ఉందని, ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని నిర్ణయానికి వచ్చారని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
దిశ, డైనమిక్ బ్యూరో: నాయకుల దోపిడీ, అవినీతి వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు అసంతృప్తి ఉందని, ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని నిర్ణయానికి వచ్చారని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్ వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన టీజేఎస్ స్టేట్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. 1978లో ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత జరిగిన ఎన్నికలకు నిన్న జరిగిన ఎన్నికలకు కొంత సారూప్యత ఉందన్నారు. అప్పుడు ఎమర్జెన్సీపై తిరుగుబాటుతో ప్రతిపక్షాలు ఏకమై అప్పటి వరకు నిరాటంకంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించారని గుర్తుచేశారు. ఇప్పుడు కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఏకం అయ్యి ఒక తిరుగుబాటు చేశారని, ఈ తిరుగుబాటు దేశంలో ఎక్కడ చూడలేదన్నారు. పాలకుల మీద ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక నిరసన జరిగిందని అన్నారు.
గుండెల మీద ఉన్న టన్నుల కొద్ది బరువు దిగిపోయి.. తెలంగాణ ఊపిరి పీల్చుకున్నట్లుగా ఉన్నదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఓ అవకాశం కలిగిందని, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం కోరుకోవాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామని గుర్తుచేశారు. ప్రజల చైతన్యం చూసిన తర్వాత కూడా ఇంకా ఎవరైనా పార్టీలు ఫిరాయింపులకు దిగితే మాత్రం.. ప్రజలు సహించరని, ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమన్నారు. వారి ఇళ్ల ముందు ప్రజలు ధర్నాలు చేస్తారని తెలిపారు.
కేసీఆర్, జగన్ చిల్లర రాజకీయాలు
కృష్ణానది వివాదాన్ని రేకెత్తించి ఒక ప్రయోజనం పొందాలని కేసీఆర్, జగన్ వేసిన ఎత్తుగడ భగ్నం అయ్యిందన్నారు. ఇది చిల్లర రాజకీయమని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం అనుసరించిన పద్ధతి చట్ట వ్యతిరేకం, అనాగరికమని ఆరోపించారు. నీటిని తీసుకోవడానికి చట్టబద్ధమైన దారులు ఉన్నాయని, బోర్డు నిర్ణయాలు తీసుకుని నీటిని విడుదల చేస్తుందని తెలిపారు. బోర్డు ద్వారా అయితే న్యాయమైన వాటా ఏపీకి వస్తుందని తెలిపారు. దీనిపై కేంద్ర జల శక్తికి ఉత్తరం రాస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.