BJP రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న కిషన్ రెడ్డి (వీడియో)
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నుంచి అధికారికంగా బాధ్యతలు అందుకున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నుంచి అధికారికంగా బాధ్యతలు అందుకున్నారు. ఇటీవల పార్టీ జాతీయ నాయకత్వం కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా ప్రకటించిన విషయంత తెలిసిందే. ఆషాడం కావడంతో ఆయన ఇప్పటి వరకు చాంబర్‌లోకి అడుగు పెట్టలేదు. ఆషాడం పూర్తి కావడంతో శుక్రవారం ఆయన అధికారికంగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. అధ్యక్షుడిగా చాంబర్‌లోకి అడుగుపెట్టారు. ఇప్పటికే రెండు టర్మ్‌లు అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ప్రెసిడెంట్‌గా కొనసాగారు. తొలుత శుక్రవారం ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని ఆయన దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆపై అంబర్‌పేటలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బషీర్‌బాగ్ కనక దుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ట్యాంక్ బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి అసెంబ్లీ వద్దకు చేరుకుని తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అక్కడి నుంచి నేరుగా నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి, తెలంగాణ ఏర్పాటు అనంతరం ఒకసారి అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కిషన్ రెడ్డికి ఉంది. కాగా మూడోసారి అధిష్టానం ఆయనకు అవకాశం కల్పించింది.