కాంగ్రెస్, బీఆర్ఎస్ అసలు రంగు బయటపడింది.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్
డీలిమిటేషన్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ అసలు రంగు బయటపడిందని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: డీలిమిటేషన్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ అసలు రంగు బయటపడిందని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి (Kishan Reddy) హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం పార్టీ స్టేట్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పై చెన్నైలో జరిగిన సమావేశంలో తెలంగాణ (Congress) కాంగ్రెస్, బీఆర్ఎస్ (BRS) పార్టీలు పోటీపడి మాట్లాడటం, వారి నిజ స్వరూపాన్ని బయట పెట్టిందన్నారు. దేశంలో లేని సమస్యను సృష్టించి, బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజనపై ఇప్పటివరకు పార్లమెంటులో లేదా కేబినెట్‌లో ఎటువంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. కానీ, అవకాశవాద పార్టీలు దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని తప్పుడు ప్రచారం చేస్తూ దిగజరారుడు రాజకీయాలకు తెరలేపుతున్నాయని అన్నారు. దక్షిణాది ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తోందని, భవిష్యత్తులోనూ చేస్తోందన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో కర్ణాటకలో, తెలంగాణలో గెలిచేలా, తమిళనాడులో మరింత పట్టు సాధించేలా అంకితభావంతో పని చేస్తున్నామని చెప్పారు. అయితే, దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదనే రాజకీయ కుట్ర కోణంతో కాంగ్రెస్ పార్టీ, డీఎంకే పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని తప్పుడు ప్రచారం చేస్తూ దిగజారుడు రాజకీయాలు పార్టీలు చేస్తున్నాయని మండిపడ్డారు.
కర్ణాటక, తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి వస్తుందని, గత పార్లమెంట్ ఎన్నికలతో పాటు, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రజలు బీజేపీకి మద్దతుగా తీర్పు ఇచ్చారని వివరించారు. దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదన్న కుట్రతో కాంగ్రెస్, డీఎంకే, బీఆర్ఎస్ పార్టీలు కలిసి దుష్ప్రచారం చేస్తున్నాయని వెల్లడించారు. కుటుంబ పార్టీలు, అసమర్థ పార్టీలు ముఠాగా ఏర్పడి, మోడీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. (delimitation) డీలిమిటేషన్‌పై అసత్య ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం చేసేలా మోడీ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. డీలిమిటేషన్‌కు సంబంధించి ఏవైనా చట్టాలుంటే.. ఆ చట్టాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేసినవేనని గుర్తుకు చేశారు. డీలిమిటేషన్ జరగాలంటే ముందుగా జనాభా లెక్కల సేకరణ జరగాలని, పార్లమెంటులో చట్టం చేయాలంటే మేధావులు, రాష్ట్ర ప్రభుత్వాల సలహాలు తీసుకోవాలని అన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర చాలా కీలకంగా ఉంటుందన్నారు.
నియోజకవర్గాల పునర్విభజన విషయంలో ప్రజలకు ఏదో అన్యాయం జరుగబోతోందంటూ సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒకే సమావేశం పాల్గొని ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. వారి ఆరోపణలన్నీ అసత్యాలేనని తేల్చి చెప్పారు. గత పదిన్నరేళ్లుగా మోడీ నాయకత్వంలో దేశంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి గత ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెడితే బాగుంటుందని, అంతేగాని కేంద్రంపై డీలిమిటేషన్ పేరుతో విమర్శలు చేయడం తగదని సూచించారు. గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు సైతం రాజకీయ పార్టీలు బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేశాయని, ఎన్నికలవ్వగానే కొత్త అంశాలను తెరపైకి తీసుకొస్తున్నాయన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్య సయోధ్య చేసేందుకు మజ్లిస్ పార్టీ ప్రయత్నం చేస్తోందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీలు ఒక్కటైనా తెలంగాణ ప్రజల మద్దతుతో ఆ మూడు పార్టీలను సమర్థవంతంగా బీజేపీ ఎదుర్కొంటుందన్నారు. కేవలం తమిళనాడులో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ స్టాలిన్‌ను ముందుపెట్టి నాటకమాడుతోందని, ఆ నాటకంలో కేటీఆర్ భాగస్వామ్యమయ్యారని చెప్పారు.