నేలకొండపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో జీరో సిబ్బంది..

గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యసేవలు అందించడంలో కీలకమైన ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.

Update: 2023-06-19 15:16 GMT

దిశ, నేలకొండపల్లి : గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యసేవలు అందించడంలో కీలకమైన ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సిబ్బంది కొరతతో పేద ప్రజల ప్రాణాలు బలి కొంటుంది. ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తున్నా క్షేత్రస్థాయిలో వైద్యసేవలు గగనమవుతున్నాయి. ఉన్నతాధికారులు కేవలం పరిశీలనలకే పరిమితమవుతుండటంతో రోగులకు వైద్యం చేసే అవకాశం ఉండడం లేదు. మరోవైపు వైద్యాధికారులు, ల్యాబ్‌ టెక్నీషియన్ల సిబ్బంది కొరత కూడా తీవ్ర ఇబ్బందిని కలిగిస్తోంది. సామాజిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరతపై దిశ ప్రత్యేక కథనం.

జిల్లాలో కల్లూరు, నేలకొండపల్లి, తిరుమలయపాలెం మండలాల్లో సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ) కొన్ని నెలల క్రితం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. ప్రధానంగా నేలకొండపల్లి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ మండల ప్రజలకు వైద్య సేవలు అందించే లక్ష్యంతో సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ వైద్య సిబ్బందిని నియమించకపోవడంతో నిరుపయోగంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది.

నేలకొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బందితోనే సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు అందిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే స్పష్టమవుతుంది. పెనుబల్లి సత్తుపల్లి మధిర ప్రాంతాల్లో ఏరియా ఆసుపత్రులు, అలాగే 25 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ) ఉన్నాయి. వీటిలోని 16 పీహెచ్‌సీల్లో నిరంతరం వైద్యసేవలు అందాల్సి ఉండగా కనీసం 8 గంటలు కూడా పనిచేయని పరిస్థితి నెలకొంది. నేలకొండపల్లిలోని సీహెచ్సీలో వైద్యులు, సిబ్బంది లేక ఆసుపత్రికి వచ్చే రోజులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆగమేఘాల మీద సీహెచ్సీ లను ఏర్పాటు చేసినప్పటికీ సిబ్బందిని నియమించకపోవడంతో అలంకారప్రాయంగా మిగిలిపోతున్న పరిస్థితి నెలకొంది.

వైద్య సిబ్బందిని నియమించని వైద్య ఆరోగ్య శాఖ..

నేలకొండపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిబంధనల ప్రకారం 15 మంది వైద్యాధికారులను, సిబ్బందిని నియమించాలి. అందులో డిప్యూటీ సివిల్ సర్జన్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్, హెడ్ నర్స్, స్టాఫ్ నర్స్, డెలివరీ సహకురాలు,(మంత్రసాని) ఏఎన్ఎమ్, ఫార్మసిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, డార్క్ రూమ్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, స్లీపర్ ఇలా 15, మందిని నియమించాలి. అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సామాజిక ఆరోగ్య కేంద్రంగా మార్చి చేతులు దులుపుకున్నారు. ఈ క్రమంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో పేదలు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.

అరకొరగా వైద్యసేవలు వైద్యాధికారులు, సిబ్బంది నియామకంపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు సేవలు అరకొరగా అందుతున్నాయి.సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బందిని పెట్టీ నేలకొండపల్లి సీహెచ్సీలో వైద్యం అందిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉండాల్సిన నలుగురు డాక్టర్లు, 10 స్టాఫ్ నర్స్ లు, ఒక హెడ్ నర్స్, అటెండర్, వాచ్ మెన్ ని నియమించాలి కానీ అందులో ముగ్గురిని కేటాయించినట్లే చేసి ఇద్దరు డాక్టర్లను డిప్యూటేషన్ పై ఖమ్మంలోని మామిళ్ళగుడెం, బానిగండ్ల పాడుకి కేటాయించారు.

ఉన్న ఒక్క మెడికల్ ఆఫీసర్,ఐదుగురు స్టాఫ్ నర్సులు, శానిటేషన్ సిబ్బందితో సి హెచ్ సి లో విధులు నిర్వర్తించే పరిస్థితి నెలకొంది.సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పుకుంటూ అధికారులు చేతులు దులుపుకున్నారు.పేద వాడికి సరైన వైద్యం అందించే లక్ష్యం ఇక్కడ కొంత నీరుగారిపోతుంది.కొసమెరుపు ఏంటంటే పాత బిల్డింగ్ లో అరకొర వసతులతో నెట్టుకొస్తున్నారు.నిబంధనల ప్రకారం దీని స్థానంలో కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. రోగులకు ధోబి ఘాటు కూడా ఏర్పాటు చేయాలి. కానీ అవేవీ ఇక్కడ కనిపించవు.

24గంటలు అందుబాటులో ఉంచే విధంగా అప్ గ్రేడ్ చేసినట్లు కాగితాలకే పరిమితమై క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.వీరిలో కొందరికి డిప్యూటేషన్‌పై మరోచోట అదనపు బాధ్యతలు అప్పగిస్తుండటంతో ఎక్కడా న్యాయం చేయలేకపోతున్నారు.జిల్లాలో వందల మంది వైద్యాధికారులు అవసరం కాగా పదుల సంఖ్యలో ఉన్నారు. మరోవైపు వ్యాధినిర్ధారణలో కీలకమైన ల్యాబ్ టెక్నీషియన్ల కొరత తీవ్రంగా ఉంది.పూర్తి స్థాయిలో ల్యాబ్ టెక్నీషియన్లు అందుబాటులో లేరు. టెక్నీషియన్లు ఉన్న చోట్ల అవసరమైన పరికరాలు లేకపోవడంతో ప్రైవేటు ల్యాబ్‌లే దిక్కవుతున్నాయి. పరికరాలు ఉన్నచోట సిబ్బంది కరువవుతున్నారు. దీంతో ప్రజలు విధిలేని పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పులపాలవుతున్నారు.

అన్ని తానై వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ రాజేష్..

జిల్లా ప్రధాన వైద్యశాల నుంచి డిప్యూటేషన్ పై ఇక్కడికి వచ్చిన డాక్టర్ రాజేష్ ప్రజలకు వైద్య సేవలు అందించడంలో తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. నియోజకవర్గ స్థాయి నుంచి వచ్చే రోగులకు అన్ని తానై వైద్య సేవలు అందిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు. దీనికి నిదర్శనమే ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఉత్తమ వైద్యాధికారిగా అవార్డు అందుకోవడం సూచికంగా చెప్పవచ్చు.

నిరుపయోగంగా వైద్యపరికరాలు..

నేలకొండపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో లక్షలాది రూపాయల విలువజేసే ఐసీయూ, వైద్యపరికరాలు నిరుపయోగంగా ఉన్నాయి. మొదట్లో కొద్ది కాలం వినియోగించినా, తర్వాత వాటిని మూలనపడేశారు. అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడంతో అవి ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. ముణ్ణాళ్ల ముచ్చటగా ఉన్నతాధికారుల ప్రయత్నాలు ప్రభుత్వ వైద్యసేవలపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు గతంలో అనేక కార్యక్రమం రూపొందించేవారు. ప్రజలను ఆరోగ్య కేంద్రాలకు ఆహ్వానించి అక్కడ అందుతున్న సేవలపై అవగాహన కల్పించేవారు. అది కొద్ది రోజులకే పరిమితమైంది.

సమస్యలు వాస్తవమే.. డాక్టర్ మాలతి.. డీఎంహెచ్‌ఓ

పలు ఆరోగ్యకేంద్రాల్లో తగినంతమంది వైద్యులు, సిబ్బంది ల్యాబ్‌టెక్నీషియన్లు లేరు. త్వరలోనే వీరి నియామకం జరిగే అవకాశం ఉంది. నేలకొండపల్లి సీహెచ్సీకి ఖమ్మం వైద్య కళాశాలకు సిబ్బందిని కేటాయించగానే డాక్టర్లను అక్కడికి పంపుతాం. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సకాలంలో వైద్య సేవలందేలా చూస్తాం. మూలనపడిన ఐసీయూ పరికరాలను ఉపయోగంలోకి తెస్తాం.

Tags:    

Similar News