నేను చెప్పిందే వేదం.. ఇక్కడంతా నాదే రాజ్యం!
‘క్వారీ మైనింగ్ విషయంలో నేను చెప్పిందే వేదం. నా రాజ్యాంగమే ఇక్కడ అమలవుతుంది.
దిశ, ఖమ్మం బ్యూరో: ‘క్వారీ మైనింగ్ విషయంలో నేను చెప్పిందే వేదం. నా రాజ్యాంగమే ఇక్కడ అమలవుతుంది. సంవత్సరం పొడవునా పత్రికల్లో రాసుకున్నా ఏమీ కాదు.. క్వారీకి రావాలంటే నా పర్మిషన్ కావాల్సిందే.. ఎలకు వచ్చినా నాకు సమాచారం ఇచ్చే వస్తారు’ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తోగ్గూడెం క్వారీ నిర్వాహకుడు పేర్కొన్నారు. అక్రమ మైనింగ్ పై ‘దిశ’లో వరుస కథనాలు వస్తుండడంతో జర్నలిస్టులపై బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ‘అధికారులనే కాదు.. మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులనూ మేనేజ్ చేస్తున్నా.. అలాంటప్పుడు నాకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా వాళ్లదే’ అని చెబుతుండడం గమనార్హం. జిల్లాలోని చిన్న నాయకుల నుంచి బడా లీడర్ల వరకు, కిందిస్థాయి ఆఫీసర్ నుంచి ఉన్నతాధికారి వరకు తనను ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
నీపైన ఎవరుంటారో వాళ్లకు చెప్పుకో..
అక్రమ మైనింగ్ పై ‘దిశ’లో వరుస కథనాలు వస్తుంటే.. స్థానిక విలేకరికి ఫోన్ చేసి క్వారీలో బొందపెడుతానంటూ హెచ్చరించిన నిర్వాహకుడు.. ఇప్పుడు ‘దిశ ప్రతినిధి’పై కూడా నోరు పారేసుకున్నాడు. నీపైన ఎవరుంటారో వాళ్లకు చెప్పుకో.. నన్ను ఎవడూ ఏం పీకలేడు అంటూ బెదిరింపులకు గురిచేశాడు. ఎన్ని అక్రమాలు చేసినా తనను ప్రశ్నించే అధికారి లేడంటూ చెప్పుకొచ్చాడు. వార్తలు రాసిన విలేకరితోపాటు.. స్థానికంగా ఉండే విలేకరులనూ నానా దుర్భాషలాడాడు.
చర్యలెందుకు లేవు?
తోగ్గూడెం క్వారీ అక్రమ మైనింగ్ పై అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమతులు లేకుండా బ్లాస్టింగ్స్ చేస్తున్నా.. ఫారెస్ట్, ప్రభుత్వ భూముల్లో మైనింగ్ జరుగుతున్నా ఆఫీసర్లు స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. క్వారీ నిర్వాహకుడు ఇచ్చే ముడుపులు అందుకుంటుండడంతోనే చర్యలు తీసుకునేందుకు వారు వెనుకాడుతున్నారని స్థానికంగా చర్చ జరుగుతున్నది.
బినామీల పేర్లతో..
తొగ్గూడెంలో మైనింగ్ జరుగుతున్న ప్రాంతం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలోనిది. చట్టం ప్రకారం ఇక్కడ గిరిజనులు మాత్రమే అనుమతులు తీసుకొని మైనింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ బినామీల పేరుతో గిరిజనేతరులు మైనింగ్ చేస్తూ రూ. కోట్లు ఆర్జిస్తున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీని ఎగ్గొడుతున్నారు. ఏమైనా కేసులు నమోదైతే మాత్రం గిరిజనులు బలి కావాల్సి వస్తుంది. కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అంతా తెలిసినా జిల్లా అధికారులు చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి క్వారీ ప్రభావం కారణంగా మూడు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్లు బీటలు వారుతున్నాయి. మనుషులు, పశువుల ప్రాణాలు పోతున్నా పట్టించుకునే వారు కరువవుతున్నారు. అనేక ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు స్పందించడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు.
కలెక్టర్ దృష్టి సారిస్తే..
తోగ్గూడెంలో అక్రమ మైనింగ్ పై కలెక్టర్ దృష్టి సారిస్తే అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివిధ శాఖల అధికారులు అప్పుడప్పుడు వచ్చి తూతూమంత్రంగా తనిఖీలు నిర్వహిస్తూ నిర్వాహకులకు సహకరిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా క్వారీపై ఫిర్యాదులు లేనట్టు, అంతా సక్రమంగా జరుగుతున్నట్లు కలెక్టర్ కు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. కలెక్టర్ తోపాటు రాష్ట్రస్థాయి మైనింగ్, రెవెన్యూ, ఫారెస్టు అధికారులు తోగ్గూడెం విజిట్ చేసి విచారణ చేస్తే అనేక విషయాలు బహిర్గతమవుతాయని చెబుతున్నారు.
ఉద్యమానికి సిద్ధమవుతున్న స్థానికులు
తోగ్గూడెం మైనింగ్ కారణంగా ఇబ్బందులు పడుతున్న చుట్టుపక్కల ప్రజలు ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. క్వారీ ప్రభావం వల్ల ఇండ్లు బీటలువారి కూలిపోతున్నాయని, బ్లాస్టింగుల వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నామని వాపోతున్నారు. త్వరలో ముందుకు వచ్చే సంఘాలతో కలిసి ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులను కలిసి న్యాయం చేయాలని వేడుకుంటామంటున్నారు. అప్పటికీ న్యాయం జరగకపోతే ఐక్య కార్యాచరణ ప్రకటించి ముందుకు సాగుతామని తెలిపారు.