రేపే మృగశిర కార్తె..

రోహిణి కార్తె భానుడి ప్రచండ ప్రతాపానికి ఉక్కిరి బిక్కిరైన ప్రజలు మృగశిర కార్తెలో ఉపిరి పిల్చికుంటారు.

Update: 2023-06-07 14:29 GMT

దిశ, ఖమ్మం కల్చరల్ : రోహిణి కార్తె భానుడి ప్రచండ ప్రతాపానికి ఉక్కిరి బిక్కిరైన ప్రజలు మృగశిర కార్తెలో ఉపిరి పిల్చికుంటారు. బుధవారం నుంచి మృగశిర కార్తె ప్రారంభమవుతుంది. సూర్యుడు ఒక్కొక్క నక్షత్రంలో 14 రోజుల పాటు ఉంటాడు. సూర్యుడు ఏ నక్షత్రానికి సమీపంలో ఉంటే ఆ కాలానికి (కార్తె) ఆ నక్షత్రం పేరు పెడుతారు. సౌరమానం ప్రకారం లెక్కించబడటంతో ఈ కార్తెలు ఆంగ్ల గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారం దాదాపు ప్రతి సంవత్సరం ఒకే తేదిల్లో వస్తాయి. ఆశ్వినితో ప్రారంభమై రేవతితో ముగిసే కార్తెలు 27 నక్షత్రాల పేర్లతో ఇరవై ఏడు ఉంటాయి.

మృగశిర కార్తె ప్రవేశాన్ని వర్షారంభానికి సూచనగా భావిస్తారు. రోహిణికార్తెలో రోళ్ళు పగేలే ఎండగా సతమతమైన జీవకోటికి ఈ కార్తెలో రాళ్ళు సహితం మెత్తబడతాయని ప్రజల నమ్మకం. ఈ కార్తెలో వచ్చే నైరుతి రుతుపవనాలతో వాతావరణం చల్లబడి ఉపశమనం కలుగుతుంది. మృగశిర కార్తెను రైతులు ఏరువాక సాగే కాలమని అంటారు. ఏరువాక అంటే నాగటిచాలు అని అర్ధం. ఈ కాలంలో తొలకరి జల్లులు పడగానే పోలాలన్నిదున్ని పంటలు వేయడం మొదలు పెడతారు. మృగశిర కార్తె మొదటి రోజుని ప్రజలు వివిధ ప్రాంతాల్లో మృగశిర, మృగం, మెరుగు, మీర్గం పేర్లతో పండుగలు జరుపుకుంటారు. ఈ రోజు ప్రజలు బెల్లంలో ఇంగువను కలిపి తింటారు. ఇంగువ శరీరంలో వేడిని అధికం చేసి వర్షాకాలంలో సోకే జలుబు, ఇతర వ్యాధులను నియంత్రిస్తుందని భావిస్తారు. మృగశిర కార్తె ప్రారంభం రోజు చేపలు, ఇతర మాంసాహారం తింటే వ్యాధులు దూరమవుతాయని ప్రజల నమ్మకం.

ఉబ్బసం (అస్తమా) రోగులకు యేటా మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిని సోదరుములు చేపమందు ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. మృగశిర నక్షత్రం దేవగణానికి చెందినది. దీనికి అధిపతి కుజుడు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు మంచి అదృష్టం కలిగి ఉంటారని భావిస్తారు. పూర్వం వైశంపాయుడు మృగశిరకార్తె రోజునే ఆయన శిష్యుడైన యాజ్ఞవల్క్యునికి తైత్తిరియోపనిషత్తు బోధించి వాడని అంటారు. ఈ ఉపనిషత్తు వర్షాధిపతియైన వరుణి దేవుని ప్రార్ధనతోనే ప్రారంభమవుతుంది. అటు పరమాత్మకు ఇటు లౌకిక వ్యవహారాలకు మధ్య మృగశిర కార్తెను సంధానకర్తగా భావిస్తారు. తొలకరి జల్లుల సమయంలో భూమి పై నుంచి వచ్చే మట్టివాసన జీవరాశులన్నింటికి ఆనందం కలిగిస్తుంది. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి మానవునిలో ఓజస్సు, తేజస్సు మృగశిరకార్తె అనంతరం అధికమవుతాయని జీవకుడనే పూర్వకాలం నాటి వైద్యుడు గ్రంధస్థం చేశాడు.

చేపలకు భలే గిరాకీ..

మృగశిర రోజు చేపలను భుజిస్తే ఆరోగ్యానికి మంచిదని నమ్మకంతో ప్రజలు చేపల మార్కెట్లో చేపలను కొనుగోలు చేశారు. మృగశిర రోజు చేపలను అధిక రేట్లకు విక్రయిస్తారు.

Tags:    

Similar News