వదిలిన ‘మత్తు’
గంజాయి అక్రమ రవాణా చేసే వారితో పాటు నాటు సారా తయారీదారుల గుండెల్లో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు రైళ్లు పరిగెట్టిస్తూ.. వారి మత్తు వదల కొడుతున్నారు.
దిశ, భద్రాచలం : గంజాయి అక్రమ రవాణా చేసే వారితో పాటు నాటు సారా తయారీదారుల గుండెల్లో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు రైళ్లు పరిగెట్టిస్తూ.. వారి మత్తు వదల కొడుతున్నారు. ఒకే రోజు 105 మంది సిబ్బంది దాడులు నిర్వహించి 200 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకోవడమే కాకుండా 18,500 లీటర్ల బెల్లం పానకం నిర్వీర్యం చేయడం సంచలనంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు గంజాయి, నాటుసారా తయారీ నిర్మూలనే ధ్యేయంగా అనేక దాడులు నిర్వహిస్తూ గంజాయి, నాటుసారా రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2024 సంవత్సరం జనవరి నుండి నవంబర్ 30 వరకు అక్రమంగా గుడుంబా తయారు చేస్తున్న, విక్రయస్తున్న వారిపై 1439 కేసులు నమోదు చేసి , 1160 మందిని అరెస్టు చేశారు.
మంగళవారం భద్రాచలం సరిహద్దు ఆంధ్రలోని ఎటపాక మండలం పిచ్చుకులపాడు, గుండువారి గూడెం గ్రామాలలో నిర్వహించిన దాడులలో పట్టుకున్న నాటు సారా తో కలిపి 7,268 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా సారా తయారీకి వినియోగించే 1,36,486 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. అలాగే 27,877 కేజీల నల్ల బెల్లం, 7,645 కేజీల పటిక స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తరలించే కేసులలో 193 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. ఒడిస్సా, ఛత్తీస్గడ్ రాష్ట్రాల నుండి ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై 173 కేసులు నమోదు చేసి 281 మందిని అరెస్ట్ చేశారు. 3321 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ కేసులలో మొత్తం 101 వాహనాలను సీజ్ చేశారు.