ఆ వైకుంఠధామం సొగసు చూడతరమా..

వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల మండలం తనికెళ్ళ గ్రామంలో ఉన్న వైకుంఠధామం నామరూపాలను కోల్పోయింది.

Update: 2023-06-19 07:56 GMT

దిశ, వైరా : వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల మండలం తనికెళ్ళ గ్రామంలో ఉన్న వైకుంఠధామం నామరూపాలను కోల్పోయింది. ఈ వైకుంఠధామం నిర్మాణంలో అడుగడుగునా అవినీతి, అక్రమాలు చోటు చేసుకోవటం వల్ల రెండేళ్లకే శిధిలావస్థకు చేరి దాని సొగసు చూడతరమా అని ఆ గ్రామ ప్రజలు వ్యంగ్యాస్త్రాలు సంధించే విధంగా మారింది. సుమారు రెండేళ్ల క్రితం తనికెళ్ల గ్రామంలో ఈజీఎస్ నిధులు 12 లక్షల రూపాయలతో వైకుంఠధామ పనులను చేపట్టారు. రెండు బర్నింగ్ ఫ్లాట్ ఫామ్లు , ఆఫీస్ రూమ్, వరండా, మహిళలు పురుషులకు వేరువేరుగా మరుగుదొడ్లు నిర్మించారు. అప్పట్లో హరితహారం కింద అనేక మొక్కలను ఈ వైకుంఠ దామంలో నాటారు. అయితే గత మూడు నెలల క్రితం వచ్చిన గాలిదుమారానికి వైకుంఠధామ వరండాకు వేసిన రేకులు మొత్తం లేచిపోయి పొలాల్లోకి ఎగిరిపడ్డాయి.

అయితే ఆ రేకులనే వరండా పైకప్పుగా వేసి మరలా అవి గాలిదుమారానికి ఎగిరిపోకుండా వాటిపై రాళ్లను ఏర్పాటు చేశారు. ఈ రేకులకు ఎలాంటి క్లాంపులు బిగించలేదు. అంతేకాకుండా రేకుల పై బొద్దు నిర్మించకపోవడంతో చిన్నపాటి గాలి దుమారానికి కూడా ఈ రేకులు లేచిపోతున్నాయి. ప్రస్తుతం రేకులకు పూర్తిగా రంద్రాలు పడి వర్షం వస్తే వరండా మొత్తం కురుస్తోంది. అంతేకాకుండా ఆఫీసు రూమ్ టాయిలెట్స్ లకు ఉన్న తలుపులు ఊడిపోయి దర్శనం ఇస్తున్నాయి. ఊడిపోయిన తలుపులను పక్కన పడేశారు. ఈ స్మశాన వాటికలో ఉన్న మరుగుదొడ్లు అత్యంత అధ్వాన్నంగా మారాయి. తలుపులు లేకపోవడంతో మరుగుదొడ్లు నిర్వహణ లేక అద్వాన్న స్థితిలో ఉన్నాయి. హరితహారం పథకంలో భాగంగా ఈ వైకుంఠ ధామంలో నాటిన మొక్కలు మచ్చుకు కూడా కానరావటం లేదు. ఈ మొక్కలకు నీరు పోయకపోవటంతో పూర్తిగా ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. లక్షలాది రూపాయలతో చేపట్టిన పనులకు నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు వదిలారని విమర్శలు వినవస్తున్నాయి.

ఇంత అధ్వానంగా వైకుంఠధామం మారిన గ్రామపంచాయతీ అధికారులకు కూడా కనీసం పట్టించుకోకపోవడం పలు విమర్శలకు దారితీస్తుంది. దీంతో ప్రభుత్వం వెచ్చించిన లక్షలాది రూపాయల నిధులు బూడిదలో పోసిన పన్నీరుగా మారాయి. వర్షం వస్తే కురుస్తున్న ఈ వైకుంఠధామం వల్ల ప్రయోజనం ఏమిటో ప్రభుత్వం చెప్పాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. తీవ్ర అద్వానంగా ఉన్న ఈ వైకుంఠధామం నిరుపయోగంగా మారింది. అద్వానంగా ఉన్న ఈ వైకుంఠధామంలో రాత్రి వేళల్లో జూదరులు పేకాట ఆడుతుండటంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అద్వానంగా వైకుంఠధామాన్ని నిర్మించిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని, వెంటనే మరమ్మత్తులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తనికెళ్ల గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News