కంపు కొడుతున్న రైతు వేదిక ప్రాంతం.!

రైతు వేదిక పరిసర ప్రాంతం కంపు కొడుతోంది.

Update: 2024-08-13 12:25 GMT

దిశ, జూలూరుపాడు : రైతు వేదిక పరిసర ప్రాంతం కంపు కొడుతోంది. అటవీ ప్రాంతంలోని గుట్టల మధ్యలో కట్టిన జూలూరుపాడు రైతు వేదిక చికెన్ వ్యర్ధాలకు నిలయంగా మారి రైతు వేదిక చుట్టుపక్కల కాలుష్య మయం అవుతుంది. సరైన ప్రణాళికతో నిర్మించకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు, మందుబాబుల అడ్డాగా మారిపోతుంది. రైతు వేదిక రైతులతో కళకళలాడుతోందని సంబరపడాలా..? లేదా ఇది కంపు మయంగా మారుతోందని బాధపడాలో తెలియడం లేదు. రైతు వేదిక వద్దకు వెళ్లాలంటే ముక్కు మూసుకొని గానీ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా కుళ్లిన మాంసం, కోళ్ల వ్యర్థాలు తెచ్చి రైతు వేదిక చుట్టుపక్కల ప్రాంతంలో పడేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయం పరిసర ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నప్పటికీ దీనిపై నిర్లక్ష్యపు నీడలు. అధికార యంత్రాంగం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు.

రైతులంతా ఒకచోట చేరి వ్యవసాయం, సాగు చేసే పంటల గురించి చర్చించుకోవడం కోసం గత రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించింది. ప్రతీ 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ను ఏర్పాటుచేసి, ఒక్కో క్లస్టర్ కు ఒక రైతు వేదికను నిర్మించారు. అయితే జిల్లా అధికార యంత్రాంగం పర్యవేక్షణ లోపించి జూలూరుపాడు రైతు వేదిక అటవీ (గుట్టల) ప్రాంతంలో నిర్మించడంతో రాత్రుల్లో అసాంఘిక కార్యకలాపాలకు అణువుగా మారుతుంది అంతేకాకుండా ఈ నిర్మాణం గ్రామ శివారులో ఉండడంతో మందుబాబులకు అడ్డాగా మారిందనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు రైతు వేదిక పై చిన్నచూపు చూడకుండ ప్రత్యేక దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.

 రైతువేదికపై చిన్న చూపు..: సాయిల నరేష్ రైతు,జూలూరుపాడు

మండల కేంద్రం నుండి రైతు వేదిక గ్రామ శివారు అటవీ ప్రాంతంలో నిర్మానుష్యంగా ఉండటంతో వ్యర్థాలు పడేయడానికి అనువుగా ఉండటం తో ఏం చేసినా అడిగేవారు లేరని కొందరు చికెన్ వ్యాపారస్తులు వ్యర్థాలు రాత్రుల్లో గుట్టుచప్పుడు కాకుండా పడేస్తున్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకొని జూలూరుపాడు మండలంలోని రైతు వేదికలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.

ప్రకృతి సంపదను కాపాడుకోవాలి : సాయి, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు

ఇప్పటికే రైతు వేదిక చుట్టు పక్కల ఉన్న గుట్టలు మట్టి అక్రమాలకు గురయ్యాయి. ప్రకృతి సంపదను మనం కాపాడితే. అది మనల్ని కాపాడుతుంది. రైతులకు ఉపయోగపడాల్సిన రైతు వేదిక చికెన్ వ్యర్ధాలకు నిలయంగా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుంది. తక్షణమే అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి.


Similar News