ప్రభుత్వ లక్ష్యాల మేరకు ప్రజలకు సేవలు అందించాలి : డిప్యూటీ సీఎం భట్టి

విద్యుత్ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా

Update: 2024-10-08 13:11 GMT

దిశ, ఖమ్మం : విద్యుత్ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రి  భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల విద్యుత్ అధికారులతో విద్యుత్ శాఖ పనితీరుపై, విద్యుత్ శాఖ సిఎండి వరుణ్ రెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ లతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాబోయే కాలానికి అనుగుణంగా విద్యుత్ వినియోగం ఎంత ఉన్న అందించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. గరిష్ట డిమాండ్ ఉన్న విద్యుత్ సరఫరా అందించామని ఆయన అన్నారు. ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలు, వరదల సమయంలో అర్ధరాత్రి సైతం లెక్క చేయకుండా నీళ్లల్లో పనిచేసిన ప్రతి ఒక్క విద్యుత్ ఉద్యోగిని అభినందించారు. ఆపత్కాల సేవలు వెల కట్టలేవని ఆయన అన్నారు.

ప్రజలకు అందుబాటులో ఉండాలని, సమస్యలకు స్పందించి, త్వరితగతిన పరిష్కరించాలని ఉపముఖ్యమంత్రి అన్నారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఉందని, ప్రభుత్వ దృష్టికి సమస్యలు ఉంటే తీసుకురావాలని అన్నారు. రాబోయే భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొని 2029-2030 వరకు గ్రీన్ ఎనర్జీ 20,000 మెగా వాట్ల ఉత్పత్తి చేయడానికి ప్రణాళిక లను సిద్ధం చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. రోజు రోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతున్న దృష్ట్యా విద్యుత్ వ్యవస్థను మరింత పటిష్ట పరచడానికి కావాల్సిన బడ్జెట్ పెట్టుకొని ముందుకు పోతున్నామన్నారు. ట్రాన్స్ఫార్మర్ల పై లోడ్ భారం పడకుండా కావాల్సిన ట్రాన్స్ఫార్మలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. గృహ జ్యోతి కి సంబంధించి 200 యూనిట్ల లోపు వారికి ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, ఉమ్మడి ఖమ్మం సర్కిల్ పరిధిలో ఇప్పటివరకు 26 లక్షల వినియోగదారులకు లబ్ది చేకూరిందని తెలిపారు.

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నామని రైతులకు పంటతో పాటు పవర్ తో ఆదాయం వచ్చేలా వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ ప్లాంట్ లు పెడుతున్నామని పైలట్ ప్రాజెక్ట్ కింద సోలార్ మోడల్ గ్రామంగా మధిర లోని సిరిపురం ను ఎంపిక చేయడం జరిగిందని, గ్రామంలోని ఇళ్లకు కూడా సోలార్ ప్యానల్స్ పెట్టి సోలరైజేషన్ గ్రామంగా తీర్చిదిద్దాలని అన్నారు. సోలార్ గ్రామాలుగా పైలట్ ప్రాజెక్ట్ క్రింద మధిర సిరిపురంతో పాటు, కొడంగల్, అచ్ఛంపేటల్లో కూడా సౌర విద్యుదీకరణ చేస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పోవడానికి తలసరి ఆదాయం పెరగాలని అందుకు నాణ్యమైన కరెంట్ అందించడంలో కీలకమైన పాత్ర విద్యుత్ శాఖదని అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడానికి

పోలం బాట కార్యక్రమం చేపడుతున్నారని, వంగిన పోల్ లు , వదులుగా, వేలాడుతూ ఉన్న లైన్ లు ఉండకూదని , అన్నింటిని సరిచేయాలని సూచించారు. కరెంట్ పట్ల అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రాణం చాలా విలువైనదని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ట్రాన్స్ఫార్మర్ల షెడ్ లను తనిఖీ చేయాలనీ, మరల ట్రాన్స్ఫార్మర్ల ఫైల్యూర్లు ఉండకూడదని ఉపముఖ్యమంత్రి అన్నారు. లైన్ మెన్ లకు ప్రజలతో నేరుగా సంబంధాలు ఉంటాయని, వారి ప్రవర్తన బాగుండాలని అప్పుడే ప్రజలతో సత్ సంబంధాలు మెరుగు పడుతాయని, వారిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని ఆయన తెలిపారు.

సాంకేతిక పరంగా ఎప్పటికప్పుడు వ్యవస్థలో మార్పులు వస్తున్నాయని అందుకు అనుగుణంగా, శిక్షణ అందిపుచ్చుకుని ముందుకు పోవాలని అన్నారు. విద్యుత్ శాఖకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి వారికి ఆధునిక సాంకేతిక తర్ఫీదు అందించాలని , ఇందుకు శిక్షణ కళాశాల ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నట్లు, శిక్షణ తోనే మరింత అభివృద్ధిలోకి వెళతామని చెప్పారు. విద్యుత్ శాఖలో పదోన్నతులు కల్పించామని, ఖాళీలను పూర్తి చేయడానికి త్వరలో నియామక ప్రకటన వెల్లడిస్తామని తెలిపారు. లిఫ్ట్ ఇరిగేషన్ కు విద్యుత్ చాలా అవసరం కనుక నిరంతరం వాటిపై పర్యవేక్షణ ఉండాలని, ఆ శాఖతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు.

సమీక్ష లో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదల్లో ఆత్యంత ధైర్య సాహసాలతో విద్యుత్ సరఫరా అందించిన విద్యుత్ సిబ్బందిని అభినందించారు. విద్యుత్ వినియోగం అనుగుణంగా ట్రాన్స్ఫార్మల సామర్ధ్యాన్ని పెంచాలని సూచించారు. పంట పొలాల్లో వంగి పోయి ఉన్న విద్యుత్ స్థంబాలను మార్చాలని అన్నారు. ఎప్పడు ఫోన్ చేసిన క్రింది స్థాయి సిబ్బంది స్పందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. లైన్ మెన్ ల పని తీరు పై దృష్టి సారించాలని ఆయన తెలిపారు.

అనంతరం సిఎండి, భారీ వర్షాలకు ఆర్ధరాతి సైతం లెక్కచేయకుండా మెరుగైన సేవలు అందించిన అధికారులకు మెమెంటో, ప్రశంసా పత్రాలను అందజేశారు. ప్రభుత్వ లక్ష్యాల మేరకు ప్రజలకు సేవలు అందించాలి : డిప్యూటీ సీఎం భట్టిఈ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, మాలోతు రాందాస్ నాయక్, ఇంఛార్జ్ డైరెక్టర్(హెచ్ ఆర్ డి) బి. ఆశోక్ కుమార్, ఇంఛార్జ్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) టి. సదర్ లాల్, ఇంఛార్జ్ డైరెక్టర్ (ఫైనాన్స్) వి. తిరుపతి రెడ్డి, ఇంఛార్జ్ డైరెక్టర్ ఆపరేషన్ టి. మధుసూదన్, సీజియంలు కె రాజుచౌహాన్, కె. కిషన్, కె.ఎన్. గుట్ట, బికం సింగ్, సర్కిళ్ల ఎస్ఈ లు, తదితరులు పాల్గొన్నారు.


Similar News