Pidamarthy Ravi : మాదిగలను మందకృష్ణ మోసం చేస్తుండు
మాదిగలను మందకృష్ణ మోసం చేస్తుండని మాదిగ జేఏసీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి (Pidamarthy Ravi)ఘాటు వ్యాఖ్య చేశారు.
దిశ, కూసుమంచి : మాదిగలను మందకృష్ణ మోసం చేస్తుండని మాదిగ జేఏసీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి (Pidamarthy Ravi)ఘాటు వ్యాఖ్య చేశారు. జనాభా ప్రాతిపదికన మాదిగలకు రిజర్వేషన్ ఫలాలు దక్కాలని అన్నారు. శనివారం కూసుమంచి మండల కేంద్రం ఎస్సార్ ఫంక్షన్ హాల్ లో మాదిగ జేఏసీ (Madiga JAC)ఉమ్మడి ఖమ్మం జిల్లా జేఏసీ అధ్యక్షుడు మట్టి గురుమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పిడమర్తి రవి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాలుగా మాదిగలను మోసం చేస్తున్నాడని ఆరోపించారు. 1994 నుంచి మొదలైన ఉద్యమం నాడు మాదిగల జనాభా ప్రకారం ఏడు శాతం రిజర్వేషన్ కోసం ఉద్యమం సాగించారన్నారు. కానీ నేడు మాదిగల జనాభా రెట్టింపు అయినట్టుగా తెలిపారు. ఈ రెట్టింపు పైన జనాభాకు సరిపడా రిజర్వేషన్ ఫలాలు అందాలని ఆయన జిల్లాల ప్రాతిపదికన రిజర్వేషన్ అమలు చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈ పోరాటం ప్రారంభించినట్లు తెలిపారు. మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ లక్ష్యంగా మాదిగ జేఏసీ పోరాడుతుందని తెలిపారు.
ఒక్క రిజర్వేషన్ల కోసమే మందకృష్ణ పోరాటం చేస్తే సుప్రీంకోర్టు వర్గీకరణ అనుకూలంగా తీర్పు ఇచ్చింది అన్నారు. ఆ తీర్పును ఇప్పుడు అమలు చేస్తే తెలంగాణలో మాదిగలు నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన గుర్తు చేశారు. నాడు ఉద్యమం ప్రారంభమైన రోజుల్లో ఉన్న మాదిగల జనాభాకు నేటికి చాలా వ్యత్యాసం ఉందని, కావున ఇప్పుడు ఉన్న జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు చేస్తే నష్టం జరుగుతుందని గుర్తు చేశారు. ఇప్పటికైనా మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మార్పీఎస్ ని విలీనం చేసి సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి ప్రయాణించాలని కోరారు. అప్పుడే మాదిగ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. మాదిగ ఉద్యమకారులకు, చెప్పులు కుట్టే వారికి, డప్పు కొట్టే వారికి పింఛన్ సౌకర్యం అందుతుందని అన్నారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు మంద కృష్ణకు ఎప్పుడూ ద్వారాలు తెరిచి ఉంటాయని అన్నారు.
మందకృష్ణ మాదిగ బీజేపీతో జతకట్టి కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం తగదన్నారు. వర్గీకరణ అంశం రాష్ట్రాల పరిధిలోకి వచ్చిన తర్వాత కేంద్రం చేసేది ఏమీ లేదని అన్నారు. మందకృష్ణ మాదిగ ప్రధాన ఉద్దేశం వర్గీకరణ అనేది బీజేపీతో చేయించుకోవాలని ఉర్రూత లూగుతున్నాడని ఎద్దేవా చేశారు. అలా చేస్తే 30 సంవత్సరాలుగా ఉద్యమాన్ని తాను నడిపిస్తున్నట్టుగా మాదిగలను నమ్మబలికించొచ్చని కలగంటున్నాడని విమర్శించారు. ఇప్పటికైనా మందకృష్ణ మాదిగ మాదిగలకు న్యాయం చేసే విధంగా కార్యాచరణ ప్రకటించాలని కోరారు.
ఈ సందర్భంగా పాలేరు నియోజకవర్గం, మండల కమిటీని ఎన్నుకున్నారు. పాలేరు నియోజకవర్గం జిల్లా అధ్యక్షుడిగా విజయకుమార్, కూసుమంచి మండల అధ్యక్షుడిగా కస్తాల నాగార్జునను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పెడమర్తి రవి తో పాటు, మాదిగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కొడారి ధీరన్, ఉమ్మడి ఖమ్మం జిల్లా జేఏసీ అధ్యక్షుడు మట్టే గురుమూర్తి, జై శ్రీ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు నక్క మహేష్, ఓయూ జేఏసీ నాయకులు దేవరకొండ నరేష్, కోదాడ కౌన్సిలర్ శ్రావణ్, రాష్ట్ర జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండమీద గోవిందరావు, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ చాట్ల సత్యనారాయణ, మాతంగి అనిల్ తదితరులు పాల్గొన్నారు.