Singareni:సింగరేణిలో టేకు కలప మాయం

సింగరేణి (Singareni)సంస్థ అధికారులు, కార్మికులు వారి కుటుంబాలు నివాసం ఉండేందుకు సింగరేణి క్వార్టర్లను నిర్మించింది.

Update: 2024-10-26 14:24 GMT

దిశ, కొత్తగూడెం : సింగరేణి (Singareni)సంస్థ అధికారులు, కార్మికులు వారి కుటుంబాలు నివాసం ఉండేందుకు సింగరేణి క్వార్టర్లను నిర్మించింది. దశాబ్దాల క్రితం క్వార్టర్లను నిర్మాణం చేపట్టి అందులో విలువైన టేకు కలపని (Teak wood)దూలాలుగా, తలుపులు, కిటికీలుగా ఉపయోగించారు. పాత క్వార్టర్లు కావడం, శిథిలావస్థకు చేరడంతో వాటిని కూల్చి నూతన క్వార్టర్ లు నిర్మిస్తున్నారు. క్వార్టర్ల కూల్చివేత సమయంలో మిగిలిన టేకు కలప, రాప్టర్లు, దూలాలను సింగరేణి హెడ్ ఆఫీస్ సమీపంలోని సివిల్ కార్యాలయానికి చేర్చారు.

రహస్య ప్రదేశంలో ఫర్నిచర్ తయారు

సింగరేణి సంస్థకు సంబంధించిన లక్షల విలువైన టేకు కలపను గత ఆరు నెలలుగా మూతపడిన రామాటాకీస్ సినిమా హాల్ కి తరలించి ఫర్నిచర్ తయారు చేస్తున్నారు. ఈ ఫర్నిచర్ ని అధికారులకు పంపిస్తున్నట్లు సమాచారం. సింగరేణి సంస్థకి అవసరం లేని సత్యనారాయణ స్వామి వ్రతం పీటలు, టీవీ స్టాండ్లు, డబుల్ కాట్ మంచాలు, డైనింగ్ టేబుల్ లు, బీరువాలను తయారుచేసి అధికారులకు పంపించినట్లు సమాచారం.

    దీనికోసం ప్రత్యేకంగా ఇద్దరు సింగరేణి ఉద్యోగులను, ఇద్దరు కాంట్రాక్టు వర్కర్లను నియమించి అధికారులకు నచ్చిన విధంగా ఫర్నిచర్ తయారు చేపిస్తున్నారు. ఆరు నెలలుగా ఒక మూతపడిన సినిమా హాల్లోని గదిని అనధికారికంగా కిరాయికి తీసుకొని రహస్యంగా నలుగురు ఉద్యోగులని నియమించి అక్కడ ఫర్నిచర్ తయారు చేయడంపై పలు అనుమానాలకు తావిస్తుంది.

సింగరేణి అధికారుల ఆదేశాలతోనే కలప పక్కదారి ?

గత ఆరు నెలలుగా సింగరేణి కి సంబంధించిన వాహనాలలో కలపని తీసుకొచ్చి రహస్య ప్రదేశంలో ఫర్నిచర్ తయారు చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుమారు 50 లక్షల రూపాయల ఫర్నిచర్ పక్కదారి పట్టినట్టు సమాచారం. ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకోవడానికి వారి కింద అధికారులు వారికి నచ్చిన విధంగా, నచ్చిన మోడల్ లో ఫర్నిచర్ తయారుచేసి గుట్టు చప్పుడు కాకుండా చేరవేసినట్లు తెలిసింది.

    తమకేమీ తెలియదని, ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చిన విధంగానే తాము పని చేస్తున్నామని ఫర్నిచర్ తయారు చేస్తున్న ఇద్దరు సింగరేణి ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు అంటున్నారు. ఆరు నెలలుగా కలప తరలిపోతున్నా అధికారులకి తెలియకుండా ఉంటుందా అని పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే సుమారు 20 వ్యాన్ల లోడు టేకు కలపని ఆరు నెలలుగా బయటకు తరలించి ఫర్నిచర్ గా మార్చినట్లు తెలుస్తోంది.

కింది స్థాయి ఉద్యోగులే బలి పశువులా

కలప తరలించడంపై తమకేమీ తెలియదని ఫర్నిచర్ మొత్తం, హాస్పిటల్ కి, గెస్ట్ హౌస్ కి పంపించినట్లు డీజీఎం రాజశేఖర్ వివరణ ఇచ్చారు. ఆసుపత్రులలో మంచాలకి, టీపాయిలకు మాత్రమే కలపని వాడామన్నారు. అంతా నిబంధనల ప్రకారమే జరుగుతుందని తెలిపారు. కానీ అధికారుల ఆదేశాలతోనే తాము డబుల్ కాట్ టేకు మంచాలు, బీరువాలు, వ్రతం పీటలు, టీవీ స్టాండ్లు, డైనింగ్ టేబుల్ లు తయారు చేశామని ఫర్నిచర్ తయారు చేపిస్తున్న సింగరేణి ఉద్యోగి తెలిపాడు.

నిద్రావస్థలో విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది

సివిల్ కార్యాలయం నుంచి గత ఆరు నెలలుగా సుమారు 20 లోడ్ల విలువైన లక్షల రూపాయల టేకు కలపని రామాటాకీస్ కి తరలించి ఫర్నిచర్ గా మారుస్తున్నారు. వాహనంలో కలప సివిల్ కార్యాలయం నుండి బయటకు వెళ్లే సమయంలో సామిల్లు (కర్ర కోత మిల్లు )కి వెళ్తున్నట్లుగా సెక్యూరిటీ సిబ్బంది వద్ద చెప్పి వాహనాన్ని రామాటాకీస్ లోకి తీసుకెళ్లి అన్లోడ్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ కలప సింగరేణి సంస్థకు ఉపయోగపడేదైతే బాగుండేది. కానీ ఉన్నతాధికారులకు విలువైన టేకు కలప ద్వారా ఫర్నిచర్ తయారు చేసి పంపిస్తున్నట్లు సమాచారం.

     అసలు ఒక రహస్య ప్రాంతంలో కలపని ఉంచి ఫర్నిచర్ తయారు చేయడంలో ఉన్న మతలబు ఏంటో అధికారులు తెలపాలి. ఇంత తతంగం జరుగుతున్నా విజిలెన్స్, సెక్యూరిటీ అధికారులు స్పందించకపోవడం పై పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా మేల్కొని సింగరేణి సంస్థకి చెందిన విలువైన వస్తువులను, ఆస్తులను కాపాడాలని కార్మికులు కోరుతున్నారు. 

Tags:    

Similar News