ఉపాధి కార్యాలయంలో మస్టర్ కాపీలు మాయం..

మండలంలోని మర్లపాడు గ్రామంలో 2022 సంవత్సరం నవంబర్ నెలలో ఉపాధిహామీ కూలీలు వ్యవసాయ భూమిలో ఐదురోజులు పనిచేశారు.

Update: 2023-05-15 14:51 GMT

దిశ, వేంసూర్ : మండలంలోని మర్లపాడు గ్రామంలో 2022 సంవత్సరం నవంబర్ నెలలో ఉపాధిహామీ కూలీలు వ్యవసాయ భూమిలో ఐదురోజులు పనిచేశారు. ఆ పనికూడా వేరొక రైతుకు చేయాల్సిన పనిని మేట్, ఫీల్డ్ అసిస్టెంట్ కలిసి ఇక్కడ చేయించారు. అయినప్పటికీ సుమారు ఏడు నెలలుగా వారి ఖాతాలో డబ్బులు పడలేదు. అప్పటినుండి అడుగుతుంటే ఇవిగో వస్తాయి, అవిగో వస్తాయి అంటూ మేట్ దగ్గర నుండి పై అధికారి వరకు మసిపూసి మారేడుకాయ చేశారు.

కూలీలు, రైతు కలిసి గట్టిగా అడిగే సరికి, మీ మస్టర్ లు, డిమాండ్ లు పోయినవి (డిలీట్) మీరు మళ్ళీ వేరే చోట పనిచేస్తే అప్పుడు చూద్దాం అని ఫీల్డ్ అసిస్టెంట్ వర్మరావు, టెక్నికల్ అసిస్టెంట్ వీరబాబు నిర్లక్ష్యంగా సమాధానం చెపుతున్నారని కూలీలు వాపోతున్నారు. పని చూపించే విధానంలో కూడా వ్యత్యాసం చూపిస్తున్నారని అన్నారు. అసలే రోజుకూలి చేసుకుని బ్రతికే మాకు చేసిన పనికి ఏడునెలలుగా డబ్బులు రాకపోతే ఎలా అని, చేసినపని మస్టర్ లు, పెట్టిన డిమాండ్లు ఆఫీసుల్లో కనపడకుండా ఎలా పోతాయని, అవన్నీ వాళ్ళ చేతిలో పనేకదా, ఇదంతా చూస్తుంటే కావాలని పక్షపాతం చూపిస్తున్నట్లు ఉందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి డబ్బులు ఇప్పించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News