Minister Thummala : గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం
గత బీఆర్ఎస్ హయాంలో పదేళ్లపాటు కొనసాగిన అస్తవ్యస్త పాలన
దిశ, వైరా : గత బీఆర్ఎస్ హయాంలో పదేళ్లపాటు కొనసాగిన అస్తవ్యస్త పాలన వల్ల రాష్ట్రం మొత్తం చిన్నాభిన్నమైందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లా వైరాలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే సభా వేదిక ఏర్పాట్లను తుమ్మల బుధవారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు ఏమాత్రం సిగ్గు లేకుండా అసత్యప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ఆ ప్రభుత్వ హయాంలో రైతులను అన్ని విధాలుగా మోసం చేసి ఇప్పుడు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆక్షేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు కూడా పూర్తికాకముందే 42 లక్షల మంది రైతులకు రూ.31వేల కోట్ల రూ.రెండు లక్షల రుణమాఫీని గురువారంతో అమలు చేస్తున్నామని తెలిపారు.
కనీసం బిడ్డ పుట్టడానికైనా 9 నెలల సమయం పడుతుందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కూడా కాకముందే బీఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి చిల్లర రాజకీయాలను తాము పట్టించుకో బోమని స్పష్టం చేశారు. ఐదేళ్ల ముందు రైతుల రుణాలను మాఫీ చేయలేని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు.రైతులను రెచ్చగొట్టే విధంగా కాంగ్రెస్ ను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, సీపీ సునీల్ దత్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మార్క్ఫెడ్ రాష్ట్ర మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.