వార్డెన్‌పై చర్యలు ఉండేనా.. నిర్లక్ష్యంగా డివిజన్ అధికారి తీరు.!

ప్రభుత్వ వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న కిష్టారం బీసీ బాలుర వసతి గృహానికి, కల్లూరు బీసీ బాలుర వసతి గృహానికి వార్డెన్‌గా పనిచేస్తున్న ఉద్యోగి రోజులు తరబడి ఉద్యోగానికి రాకుండా, అక్కడ పనిచేసే వర్కర్లతో విధులు సక్కబెడుతున్నట్లు తెలుస్తుంది.

Update: 2024-09-17 03:37 GMT

దిశ, ఎడ్యుకేషన్: ప్రభుత్వ వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న కిష్టారం బీసీ బాలుర వసతి గృహానికి, కల్లూరు బీసీ బాలుర వసతి గృహానికి వార్డెన్‌గా పనిచేస్తున్న ఉద్యోగి రోజులు తరబడి ఉద్యోగానికి రాకుండా, అక్కడ పనిచేసే వర్కర్లతో విధులు సక్కబెడుతున్నట్లు తెలుస్తుంది. సదరు ఉద్యోగి ఖమ్మంలో నివాసం ఉంటూ, కల్లూరు బీసీ బాలుర, కిష్ట్రరం బాలురు వసతి గృహాలకు వార్డెన్‌గా ఉంటూ సేవలందిస్తున్నట్లు చెబుతున్నారు. ఒక వసతి గృహానికి సేవలు అందించే ఉద్యోగి స్థానికంగా ఉంటూ డ్యూటీ చేయవలసి ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వసతి గృహంలో ఉండి విద్యార్థులకు కావలసిన ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించవలసిన వార్డెన్, ఖమ్మంలో ఉంటూ, రెండు హాస్టల్లో విధులు ఎలా చక్కబెడుతున్నారో తెలియాల్సి ఉంది. ఇంత జరుగుతున్న వసతి గృహాలను పర్యవేక్షించ వలసిన డివిజన్ అధికారి వార్డెన్ వద్ద నుంచి నెలకు విద్యార్థికి 30 రూపాయలు చొప్పున వసూలు చేస్తూ, వార్డెన్‌ను చూసి చూడనట్టుగా వదిలేస్తున్నట్లు బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం రెండు హాస్టల్లో కలిపి 120 మంది విద్యార్థులు అధికారికంగా ఉన్నారు. కానీ ప్రస్తుతం హాస్టల్‌లో ఒక్కరంటే ఒక్కరే విద్యార్థి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలకు సెలవు దినాలలో రెండు వసతి గృహాలలో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి, సేవలందించవలసిన వార్డెన్ విధులకు రాకపోయినా, డివిజన్ అధికారి కాపాడుతున్నట్టు ఆరోపణలు కూడా లేకపోలేదు. హాస్టల్ వార్డెన్ సీనియర్ ఉద్యోగి అయి ఉండటం వల్ల, వార్డెన్ పై డివిజన్ అధికారి చర్యలకు వెనుకాడుతున్నట్లు తెలుస్తుంది. విధులకు గైహాజరవుతున్న హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాలు వెనుకబడిన తరగతుల జిల్లా అధికారిని కోరుతున్నారు. జిల్లా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.


Similar News