బీఆర్ఎస్ నేతలపై కక్షసాధింపు సరికాదు

బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్​ నాయకులు కక్షసాధింపు సరికాదు అని ఎమ్మెల్సీ తాత మధు అన్నారు.

Update: 2024-10-16 12:54 GMT

దిశ,తిరుమలాయపాలెం : బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్​ నాయకులు కక్షసాధింపు సరికాదు అని ఎమ్మెల్సీ తాత మధు అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఒత్తిడి తెచ్చి వినకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు భాషబోయిన వీరన్నపై అధికార పార్టీ నాయకులు అక్రమ కేసులు పెట్టి వేధించడం సరికాదన్నారు. తప్పుడు కేసులు పెడితే సహించేది లేదని, త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. మండలంలోని జల్లేపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరన్న, మాజీ జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, లీగల్ సెల్ అధ్యక్షుడు బిచ్చాల తిరుమలరావు, తెలంగాణ ఉద్యమకారులు డోకుపర్తి సుబ్బారావు, పగడాల ‌నరేందర్,‌ లింగనబోయిన సతీష్ తదితరులతో కలిసి బుధవారం వీరన్న నివాసానికి వెళ్లి తాత మధు పరామర్శించారు. వీరన్నతో మాట్లాడి అధైర్య పడొద్దని, పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.

     ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ పార్టీ సభ్యులపై అక్రమ కేసులు నమోదు, దాడులను తాత మధుకు నేతలు వివరించారు. దాంతో ఆయన అధికార పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏ పార్టీ కార్యకర్తపై తప్పుడు కేసులు మోపలేదని, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి అధికారం పొందిందని, అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని పేర్కొన్నారు. అందుకే స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు లీగల్ సెల్ ద్వారా సమాధానం చెబుతామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ శ్రేణులకు అన్యాయం జరగనివ్వమని హామీ ఇచ్చారు. ఆయన వెంట పీఏసీఎస్ చైర్మన్ చావా వేణుగోపాల్ కృష్ణ, నాయకులు కొండబాల వెంకటేశ్వర్లు, మంచానాయక్, రాజు, శేఖర్, చందు పాల్గొన్నారు.   

Tags:    

Similar News