నాటు కోళ్ల పెంపకంతో ఆదాయం

నాటు కోళ్ల పెంపకం ద్వారా సులభంగా అధిక ఆదాయం సమకూర్చుకోవచ్చని కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు.

Update: 2024-11-06 12:45 GMT

దిశ, కొత్తగూడెం రూరల్ : నాటు కోళ్ల పెంపకం ద్వారా సులభంగా అధిక ఆదాయం సమకూర్చుకోవచ్చని కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. సుజాతనగర్ మండలం రాఘవపురం గ్రామంలో రైతు ఆకుల కృష్ణయ్య ఒకటిన్నర ఎకరాల్లో మామిడి తోటతో పాటు చేపడుతున్న నాటు కోళ్ల పెంపకాన్ని కలెక్టర్ జితేష్ పాటిల్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా షెడ్డు నిర్మాణానికి ఎంత ఖర్చు అయింది, కోళ్ల పెంపకంలో తీసుకుంటున్న జాగ్రత్తలు, వాటి ద్వారా వచ్చే ఆదాయం తదితర వివరాలను రైతును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేవలం ఒక పంటపై ఆధారపడకుండా మామిడి తోటలో అంతర పంటగా జామ, బొప్పాయి, నాటు కోళ్ల పెంపకం చేపట్టిన కృష్ణయ్యను అభినందించారు. దీంతోపాటు తేనెటీగల పెంపకం, నీటి కుంట ద్వారా చేపల పెంపకంచేపట్టాలని సూచించారు.

    మహిళా సమాఖ్య సంఘాలు వీరిని ఆదర్శంగా తీసుకొని నాటు కోళ్లు, బాతులు, పుట్టగొడుగుల పెంపకం చేపట్టాలన్నారు. అనంతరం ఆకుల రామకృష్ణ అనే రైతు నాలుగు ఎకరాల పత్తి చేనులో అంతర పంటగా వేసిన మునగ, ఆకు కూరలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేవలం ఒకే పంటపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా మునగ సాగు చేపట్టవచ్చు అన్నారు. మహిళా సమైక్యల ద్వారా రైతుకు అనుకూల ధర చెల్లించి మునగాకు సేకరించి పౌడర్ అమ్మడం ద్వారా మహిళా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అని తెలిపారు.

     రాఘవపాలెం గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్లాస్టిక్ బాటిళ్లతో తయారుచేసిన ఆకృతులను చూసి పంచాయతీ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. అనంతరం సుజాతనగర్ గ్రామంలో మల్లెల వెంకట రామ ప్రసాద్ అనే రైతు నాలుగు ఎకరాల్లో సాగు చేస్తున్న నిమ్మ, ఆపిల్, అవకాడో, బాదం, జామ, ద్రాక్ష, కొబ్బరి తదితర మొక్కలను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్య చందన, మహిళా సమాఖ్య సభ్యులు, పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 


Similar News