Police Commissioner : లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
రాష్ట్ర వాతావరణ శాఖ రెండు రోజుల పాటు భారీ వర్షాలు (రెడ్ అలర్ట్) సూచించిన కారణంగా ప్రజలకు ఎటువంటి ప్రమాదం తలెత్తకుండా జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచనలు విడుదల చేశారు.
దిశ, మధిర : రాష్ట్ర వాతావరణ శాఖ రెండు రోజుల పాటు భారీ వర్షాలు (రెడ్ అలర్ట్) సూచించిన కారణంగా ప్రజలకు ఎటువంటి ప్రమాదం తలెత్తకుండా జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచనలు విడుదల చేశారు. ఈ మేరకు జిల్లా పోలీసు యంత్రాంగం, జిల్లా పోలీసు అధికారులు ఎల్లవేళలా అప్రమత్తతతో విధులను నిర్వర్తించాలన్నారు. ప్రజలు అత్యవసర సమయాలలో తప్ప బయటకి రాకూడదని, ఎటువంటి సమస్యలు ఉన్నా అత్యవసర సమయంలో డయల్ 100 కు, 24 గంటలు అత్యవసర సమయంలో స్పందించేందుకు సిబ్బంది అందుబాటులో ఉంటారని, మధిర మున్సిపాలిటీలో ఫ్లైట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, హెల్ప్ లైన్ నెంబర్ 98667 76641, 63013 43180 గాని, ప్రజలు స్థానిక పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించాలని అన్నారు. దాంతో పోలీసులు ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడతారని తెలిపారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో కాలువలు, వాగులు, వంకలు నదుల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంటుందని ప్రజలు గమనించాలని కోరారు.
బ్రిడ్జిలపై నుండి నీరు ప్రవహించే సమయాలలో ప్రజలు వాటిని దాటకుండా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే అవతల వైపునకు వెళ్లాలని సూచించారు. జలాశయాలు, చెరువులు, వాగుల వద్ద మత్స్యకారులు, ప్రజలు చేపల వేటకు వెళ్లకుండా ఉండడం మంచిదన్నారు. భారీగా వర్షాలు కురుస్తున్నప్పుడు పొలాల్లో రైతులు విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలని, విద్యుత్ స్తంభాలను గాని, వైర్లను కానీ చేతులతో తాకకుండా ఉండాలన్నారు. చెట్ల కింద, పాడైన పాత భవనాలు, శిథిలావస్థలో ఉన్న భవనాలు క్రింద, పక్కన ఉండకూడదన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, పిల్లలు పాత భవనాలలో ఉండకుండా చూడాలని తెలిపారు. వాహనదారులు రోడ్ల పై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా వాహనాలు నడపాలని, నీటి ప్రవాహం, వర్షం వల్ల ఏర్పడిన గుంతలు వాహనదారులకు కనిపించక ప్రమాదానికి గురి అయ్యే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని పలు సూచనలు చేశారు.