ఆరోగ్యంపై ఫోకస్ పెట్టాలి
ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ఫోకస్ పెట్టాలని, ఆహారపు అలవాట్ల సైతం మార్చుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు.
దిశ, కొత్తగూడెం రూరల్ : ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ఫోకస్ పెట్టాలని, ఆహారపు అలవాట్ల సైతం మార్చుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి 9 వరకు నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సంబరాల సందర్భంగా మొదటి రోజు ఆదివారం కొత్తగూడెంలోని ఇల్లందు క్రాస్ రోడ్ నుంచి రామచంద్ర డిగ్రీ కళాశాల వరకు జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2కే రన్ ను ఆయన పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ప్రతిరోజూ వ్యాయామం చేయాలన్నారు.
ఆటలను ఏదో బహుమతుల కోసం కాకుండా మనం ఎంతో ఇష్టంతో ఆడుకుంటామని అన్నారు. తనకు బాల్యంలో ఆటల పట్ల అమితాసక్తి ఉండేదని చెప్పారు. ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకే ఈ 2కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించామని పేర్కొన్నారు. ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రతి ఒక్కరికి ఉదయం పూట నడక, రన్నింగ్ లాంటివి అవసరమని అన్నారు. జిల్లాలో క్రీడల అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ 2కే రన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జిల్లా కలెక్టర్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్ఓ పరంధామ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, నాగ సీతారాములు, వివిధ అసోసియేషన్ల సభ్యులు, యువత విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.