నిర్లక్ష్యానికి నిప్పు.. పోలీసులు సీజ్ చేసిన వాహనాలు అగ్నికి ఆహుతి
పోలీసులు సీజ్ చేసిన వాహనాలు అగ్నికి ఆహుతైన ఘటన సోమవారం చోటు
దిశ, ములకలపల్లి: పోలీసులు సీజ్ చేసిన వాహనాలు అగ్నికి ఆహుతైన ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఉదయం 11.30 ప్రాంతంలో పాత పోలీస్ స్టేషన్ ఎదురుగా రోడ్డు పక్కన ఉన్న మూడు ఆటోలు, ఒక ట్రాలీ అగ్ని ప్రమాదానికి గురై తగలబడ్డాయి. స్థానికులు గమనించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. స్థానికంగా రోడ్డు పనుల దగ్గర ఉన్న నీళ్ళ ట్యాంకర్, గ్రామ పంచాయతీ సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా కష్టపడి ఎట్టకేలకు మంటలను ఆర్పారు.
ఇది రెండోసారి..
ఇప్పుడు తగలబడిన వాహనాలకు దగ్గరలో గత కొద్ది నెలల క్రితం కొన్ని వాహనాలు ఇలాగే అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. తిరిగి ఇప్పుడు మరి కొన్ని వాహనాలు పూర్తిగా తగలబడి పోయాయి. సీజ్ చేసిన వాహనాలను నిర్లక్ష్యంగా నిల్వ ఉంచడం, సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. వాహనాలు ఉన్న దగ్గర చెత్తాచెదారం ఎక్కువగా ఉండటం మూలంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
కొత్త పోలీస్ స్టేషన్ కు తరలించి ఉంటే ప్రమాదం జరిగుండేది కాదు..
పాత పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు సీజ్ చేసిన ఈ వాహనాలు ఏళ్ల తరబడి నిర్లక్ష్యంగా రోడ్ సైడ్ వదిలేశారు. కొత్త పోలీస్ స్టేషన్ నిర్మించి అక్కడినుంచి విధులు నిర్వర్తించే సిబ్బంది ఈ వాహనాలను అక్కడికి తీసుకుపోయి ఉంటే ఈ ప్రమాదం జరిగుండేది కాదని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.