ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాలి

ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు.

Update: 2024-10-01 13:47 GMT

దిశ, కొత్తగూడెం : ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు, ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులు, రెండు పడకల గదుల ఇండ్లు , కొనుగోలు కేంద్రాల ఏర్పాటు అంశాలపై కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

     జిల్లా నుంచి అదనపు కలెక్టర్లు రెవెన్యూ వేణుగోపాల్, స్థానిక సంస్థలు విద్యాచందనతో కలిసి కలెక్టర్ జితేష్ వి.పాటిల్ హాజరయ్యారు. ఈ నెల 3వ తేదీ నుంచి ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం పైలట్ ప్రాజెక్టు కింద ప్రతి నియోజకవర్గంలోని ఒక మున్సిపల్, గ్రామంలో కుటుంబాల వివరాలు ఇంటింటికీ తిరిగి సేకరించాలని, దీనికి నోడల్ ఆఫీసర్ ను నియమించాలని సూచించారు. సర్వే సందర్భంగా ఆయా కుటుంబాల్లో పుట్టిన, మరణించిన వారి వివరాలు తీసుకొని ఎంట్రీ చేయాలని ఆదేశించారు. ఈనెల 8వ తేదీ వరకు ఇది పూర్తి చేయాలని, 9వ తేదీ స్క్రూటినీ ఉంటుందని, 10వ తేదీన రిపోర్ట్ సబ్మిట్​ చేయాలని కోరారు. అనంతరం ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులు జిల్లాలో ఎన్ని ఉన్నాయి? ఎన్ని పూర్తి చేశారో అడిగి తెలుసుకున్నారు.

    ఆయా దరఖాస్తులు నిబంధనల ప్రకారం పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్ని రెండు పడక గదుల ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయో వివరాలు తెలుసుకున్నారు. ఇంకా ఏమైనా పనులు చేయాల్సి ఉంటే వెంటనే పూర్తి చేసి త్వరలో పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలని సూచించారు. సన్న వడ్లకు ప్రభుత్వం క్వింటాల్​కు రూ. 500 అదనంగా అందజేయనుందని తెలిపారు. సన్న, దొడ్డు వడ్ల సేకరణకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సన్న వడ్ల లో దొడ్డు వడ్లు కలవకుండా చూసుకోవాలని, వ్యవసాయ అధికారి పరిశీలించిన తర్వాత వాటిని పంపాలని పేర్కొన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి, సీఎస్ ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ సమీక్ష సమావేశం

ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం కుటుంబ వివరాలను పక్కాగా సేకరించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి 100 శాతం కుటుంబ సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎల్ఆర్ఎస్ పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని, దానికి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

     జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇంటి జారీ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, అర్హులైన పేదలకు మాత్రమే లబ్ధి చేకూరేలా జాబితా రూపొందించాలని అధికారులు ఆదేశించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ అధికారి రుక్మిణి, మేనేజర్ త్రినాథ్ బాబు, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లందు, మణుగూరు మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News