నీళ్లలో నలకలు...అన్నంలో పురుగులు...కూరల్లో వెంట్రుకలు

తమ పిల్లలు ఉన్నత చదువులు చదివి వృద్ధిలోకి రావాలని గ్రామీణ ప్రాంతాల నుండి విద్యార్థులను తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పట్టణాలకు పంపి ప్రభుత్వ వసతి గృహాలలో ఉంచుతూ చదివిస్తున్నారు.

Update: 2024-09-21 09:59 GMT

దిశ, కొత్తగూడెం : తమ పిల్లలు ఉన్నత చదువులు చదివి వృద్ధిలోకి రావాలని గ్రామీణ ప్రాంతాల నుండి విద్యార్థులను తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పట్టణాలకు పంపి ప్రభుత్వ వసతి గృహాలలో ఉంచుతూ చదివిస్తున్నారు. కానీ వారు వసతి గృహాల్లో అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగూడెంలోని ఎస్సీ బాలికల పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో విద్యార్థినులు భోజనం, తాగునీరు విషయంలో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అవి అపరిశుభ్రంగా ఉండడంతో తినలేక, పస్తులు ఉండలేక ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం, సిబ్బందిపై వార్డెన్ అజమాయిషీ లేకపోవడం విద్యార్థినులకు శాపంగా మారింది.

పురుగుల అన్నమే పరమాన్నం

హాస్టల్లో నాణ్యమైన భోజనం లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భోజనం రుచికరంగా లేకపోయినా శుభ్రంగా ఉంటే చాలనుకున్నా అదీ అమలు కావడం లేదు. మూడు రోజుల క్రితం పప్పులో వెంట్రుకలు దర్శనమిచ్చాయి. ఒకటి రెండు కాదు, పదుల సంఖ్యలో వెంట్రుకలు ఉండడంతో విద్యార్థినులు పప్పుని తినకుండానే పడేశారు. ఈ విషయం బయటికి చెబితే తమను ఇబ్బంది పెడతారని భయపడి ఎవరికీ చెప్పలేదు. దీంతో విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. అన్నంలో తరచూ పురుగులు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భోజనాన్ని తినలేక అర్ధాకలితోనే ఉంటున్నారు.

తాగునీటిలో నలకలు

ఎస్సీ బాలికల వసతి గృహాల్లో శుద్ధ జలం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 1000 లీటర్ల ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. కొత్తగూడెం బాలికల పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో శుద్ధ జలయంత్రం మూలన పడి సుమారు 8 నెలలు కావస్తుంది. దాన్ని మరమ్మతు చేయించడానికి అధికారులు ప్రయత్నించలేదు. దీంతో విద్యార్థినులు బోరు నీటిని తాగుతున్నారు. కనీసం ఆ ట్యాంక్ ని వారానికి ఒకసారి కూడా శుభ్రం చేయడం లేదు. దాంతో నీళ్లు మొత్తం అపరిశుభ్రంగా ఉంటున్నాయి. ఈ నీటిని తాగితే ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. పైగా ఈ విషయాలు ఎవరికైనా చెబితే తమని ఏదో ఒక వంకతో వేధిస్తారని భయపడుతున్నారు.

ఆర్వో ప్లాంట్ కు మరమ్మతులు చేయిస్తాం : అనసూర్య, జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారిణి

ఎస్సీ బాలికల పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో ఆర్వో ప్లాంట్ కి మరమ్మతులు చేయిస్తాం. విద్యార్థినులకు శుద్ధమైన నీటిని అందజేస్తాం. తాగు నీటిలో నలకలు వస్తున్నాయని, భోజనంలో పురుగులు, వెంట్రుకలు వస్తున్నాయని తమ దృష్టికి రాలేదు. ఈ విషయంపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటాం. 

Tags:    

Similar News