కేంద్రానికి బుద్ది చెప్పాలి : సాబీర్ పాషా
అధికారం చేపట్టినప్పటి నుండి ధరలు అమాంతం పెంచుకుంటూ పోతున్న కేంద్ర ప్రభుత్వానికి దేశ ప్రజలు బుద్ధి చెప్పాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే. సాబీర్ పాషా అన్నారు.
దిశ, పాల్వంచ : అధికారం చేపట్టినప్పటి నుండి ధరలు అమాంతం పెంచుకుంటూ పోతున్న కేంద్ర ప్రభుత్వానికి దేశ ప్రజలు బుద్ధి చెప్పాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే. సాబీర్ పాషా అన్నారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో గురువారం స్థానిక కే ఎస్ పీ రోడ్ లో వినూత్నంగా రోడ్డుపై కట్టెల పొయ్యి పెట్టి, ఖాళీ సిలిండర్లతో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని సాబీర్ పాషా మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుండి పేదోడి కష్టార్జితాన్ని తన మిత్రులైన ఆదానీ, అంబానీ లాంటి అనేక కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టటమే ధ్యేయంగా పెట్టుకొని పరిపాలన కొనసాగిస్తున్నాడని విమర్శించారు. నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటివరకు గ్యాస్ ధరలు అనేకసార్లు పెంచి మహిళలను మళ్లీ కట్టెల పొయ్యి వైపు వెళ్లే విధంగా చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు ముగిసినా విచ్చలవిడిగా
నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతూ ఆరోపించారు. అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా ధరలు తగ్గించకుండా సామాన్యులను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ దేశ మహిళలకు నరేంద్ర మోడీ ఇచ్చే కానుక ఇదేనా అని ప్రశ్నించారు. దేశ ప్రజలందరూ ఐక్యంగా ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే ఉద్యమ సత్తా ఏంటో చూపిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, జిల్లా సమితి సభ్యులు ఉప్పుశెట్టి రాహుల్, వి. పద్మజ, నాయకులు అన్నారపు వెంకటేశ్వర్లు, శనగారపు శ్రీనివాసరావు, నరహరి నాగేశ్వరరావు, గూడపూరి రాజు, కడలి సంఘమిత్ర, కమటం ఈశ్వరమ్మ, త్రివేణి, లక్ష్మి, నాగమణి, షాహిన్, వర్క అజిత్, ఎండీ పాషా, ఫక్రుద్దీన్, వెంకన్న, రంభాయి తదితరులు పాల్గొన్నారు.