ఖైరతాబాద్, స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉప ఎన్నిక ఖాయం: KTR కీలక వ్యాఖ్యలు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరాతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ఒక పార్టీ గుర్తుపై పోటీ చేసి గెలిచి.. వేరే పార్టీలో పోటీ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.
స్టేషన్ ఘన్‌పూర్, ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక ఖాయమని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా సంచనలం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసుపైన ఆయన రియాక్ట్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు సంబంధమే లేదని తేల్చి చెప్పారు. ఫోన్ ట్యాప్ చేసి తాను హీరోయిన్లను బెదిరించానని ఓ మంత్రి మాట్లాడారు.. ఇలానే అసత్య ఆరోణలు చేస్తే ఎవరినీ వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు.