బీఆర్ఎస్కు బిగ్‌షాక్.. పార్టీని వీడనున్న ముఖ్య నేతలు
శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి.
దిశ, కరీంనగర్ బ్యూరో : రాష్ర్ట శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ముఖ్యనేతలు పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరగా మరికొందరు రాజీనామా చేసి తటస్థంగా ఉన్నారు. పెద్దపల్లిలోని మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ బీజేపీ టికెట్ కోసం ఇటీవల బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిశారు. కాగా, తాజాగా మరికొందరు బీఆర్ఎస్ ముఖ్యనేతలు పార్టీని వీడడేందుకు రంగం సిద్దమైనట్లు సమాచారం.. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో మంతనాలు జరిపిన నేతలు త్వరలోనే బీజేపీ పార్టీ తీర్ధం పుచ్చుకోవడానికి రంగం సిద్దమైనట్లు తెలిసింది.
పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికలకు ముందే షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దాసరి మనోహర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నల్ల మనోహర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. అంతకు ముందు పెద్దపల్లి ఎమ్మెల్యే తీరుకు నిరసనగా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, పెద్దపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ రాజయ్యతోపాటు పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పార్టీని వీడి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పెద్దపల్లి నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గం అయిన ముదిరాజ్ కులానికి చెందిన పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ వచ్చే ఎన్నికల్లో తనకు బీజేపీ టికెట్ కేటాయించాలని కోరుతున్నాడు. ఇటీవల హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తోపాటు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డిని తన అనుచరులతో కలిశాడు. పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించిన బొద్దుల లక్ష్మణ్‌కు టికెట్ రాకపోవడంతో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరం ఉంటున్నాడు.
తాజాగా మరికొందరు నేతలు..
ఇప్పటికే రోజురోజుకు పార్టీకి నేతలు దూరం అవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోతున్న తరుణంలో తాజాగా మరికొందరు నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు సిద్దమైనట్లు సమాచారం. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో ఇటీవల హైదరాబాద్‌లో మంతనాలు జరిపినట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలతోపాటు పలువురు సర్పంచ్‌లు, నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలు ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ టికెట్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి కేటాయించగా కాంగ్రెస్ టికెట్ విజయరమణరావుకు గ్యారెంటీ అనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ పెద్దపల్లి టికెట్ బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలని వీరు ఈటలను కోరినట్లు సమాచారం. ఈటల నుంచి సానుకులంగా స్పందన రావడంతో త్వరలోనే పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్లు నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది.