Delhi liquor scam : ఇవాళ కీలక విచారణ.. కవితకు నోటీసుల నేపథ్యంలో ఉత్కంఠ
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ, సీబీఐ దూకుడు పెంచాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ, సీబీఐ దూకుడు పెంచాయి. తాజాగా ఈ కేసులో సమీర్ మహేంద్రుపై ఈడీ దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం కీలక విచారణ జరగనుంది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సమీర్ మహేంద్రుతో పాటు 4 కంపేనీలపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై విచారణ జరగనుంది. ఈ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించిన అంశాలను పరిశీలిస్తున్న ఈడీ.. ఇండో స్పిరిట్ అధినేత సమీర్ మహేంద్రుతో పాటు మరో 4 కంపెనీలపై గత నవంబర్ 26న స్పషల్ కోర్టు ముందు ఈడీ తొలి ఛార్జిషీట్‌ను కూడా దాఖలు చేసింది.
ఈ ఛార్జిషీట్‌లో సమీర్ మహేంద్రుతో పాటు నాలుగు కంపెనీలపై ఈడీ పలు అభియోగాలను మోపింది. ఈ నేపథ్యంలో ఇవాళ జరగబోయే విచారణలో ఈ ఛార్జిషీట్‌లోని అంశాలను పరిగణలోకి తీసుకోవాలా లేదా అనే అంశంపై స్పెషల్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగపాల్ ముందు విచారణ జరగబోతోంది. ఈ కుంభకోణానికి సంబంధించి వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్న నేపథ్యంలో ఈ ఛార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకుంటున్నామని ఇవాళ విచారణలో కోర్టు అంగీకరిస్తే ఈ కేసు దర్యాప్తు మరో దశకు చేరుకుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కాగా ఈ కేసులో సమీర్ మహేంద్రుతో పాటు మరి కొంత మందిని అదుపులోకి తీసుకుని విచారించగా ఇదే కేసులో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిన్న సీబీఐ అధికారులు ప్రశ్నించారు. 160 సీఆర్పీసీ ప్రకారం సాక్షిగా విచారణ జరిపిన దర్యాప్తు అధికారులు కవితకు మరో నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. ఈ సారి 91 సీఆర్పీసీ కింద నోటీసులు అందించడంతో ఈ కేసులో తర్వాత ఏం జరగబోతోందనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
Read More...