Mahesh Kumar Goud: నామినేటెడ్ పదవులు, సర్పంచ్ ఎన్నికలపై పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

నామినేటెడ్ పదవులు, సర్పంచ్ ఎన్నికలపై పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-04 13:24 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఎలాంటి రాజకీయ నేపథ్యంలో లేని ఓ బీసీ బిడ్డకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు దక్కడం కేవలం కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం అవుతుందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కష్టపడ్డ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు దక్కుతుంది అనడానికి తానే ఓ ఉదాహరణ అన్నారు. పీసీసీ సారథి హోదాలో తొలిసారి సొంత జిల్లా నిజామాబాద్ కు వచ్చిన సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పలువురు మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు హాజరైన ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. పీసీసీ చీఫ్ అవుతానని తాను కలలో కూడా ఊహించలేదని కానీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జు ఖర్గే, ప్రియాంక గాంధీ తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించారని అన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరి సహకారంతో ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తానన్నారు. 2028 ఎన్నికల్లో రాష్ట్రంలో 90-100 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని,15 ఎంపీ స్థానాలు గెలుచుకుని కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని ఏదైనా విషయంలో చివరి వరకు నాయకుల మధ్య పోటీ ఉన్నా హైకమండ్ నిర్ణయం తీసుకున్నాక అందరం కలిసి పని చేస్తామన్నారు. మధుయాష్కీ గౌడ్ తనకు పెద్దన్నలాంటి వారన్నారు. రాజకీయంగా డీ.శ్రీనివాస్ తో తనకు విభేదాలు ఉన్నా ఆయన నాకు రాజకీయంగా గురువు అని, తనకు పదవి వచ్చిన సమయంలో ఆయన మన మధ్యలో లేకపోవడం బాధాకరం అన్నారు.

కమిటీల్లో 60 శాతం బడుగు బలహీన వర్గాలకే ఛాన్స్:

కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మలు కార్యకర్తలే అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పదవుల కన్నా పార్టీనే ముఖ్యం అని, పార్టీ ముందుకు వెళ్లాలంటే కార్యకర్తలే బలం అన్నారు. త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి కార్యకర్తలను కూడా పదవులతో అలకరిస్తామన్నారు. పెద్దల సహకారంతో నేను కూర్పు చేయబోయే పీసీసీ, డీసీసీ కమిటీల్లో కనీసం 60 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు చోటు ఉంటుందని ప్రకటించారు. ఈ రాష్ట్రంలో సోషల్ ఇంజినీరింగ్ జరగాలనేది రాహుల్ గాంధీ ఆలోచన అని అందుకు అనుగుణంగా బీసీ కులగణన ప్రక్రియకు కసరత్తు జరుగుతున్నదన్నారు.

కులం పేరుతో మోడీ, ప్రాంతం పేరుతో కేసీఆర్ రాజకీయాలు:

ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ కులం, మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని మహేశ్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. మేమంతా ప్రతి రోజు దేవుళ్లను పూజిస్తామని కానీ ఏనాడు దేవుడి పేరుతో ఓట్ల బిక్షాటన చేయలేదన్నారు. అసలు శ్రీరాముడికి బీజేపీ ఏం సంబంధం అని ప్రశ్నించారు. మతాల పేరుతో కులాల పేరుతో పోట్లాడి మన భవిష్యత్ ను నాశనం చేసుకుందామా? లేక అభివృద్దే ధేయంగా ముందుకు వెళ్తున్న సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ విధానంతో నడుద్దామా అని ప్రజలు ఆలోచించాలన్నారు. మతం, కులం వేలు రాజకీయం వేరు అని, బీజేపీ వేరు శ్రీరాముడు వేరన్నారు. మేమంతా శ్రీరాముడి భక్తులమే అన్నారు. కులం పేరుతో మోడీ, ప్రాంతం పేరుతో కేసీఆర్ రాజకీయాలు చేశారని విమర్శించారు.దేవుళ్ల పేరుతో రాజకీయం చేసే మోడీ గొప్పతనమేముందని ప్రశ్నించారు. రాష్ట్ర సంపదనంతా దోచుకున్న బీఆర్ఎస్ పాలకులు తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమత్తారు. ఇప్పడి ముబ్బడిగా అప్పులు చేసిన కేసీఆర్ ఇప్పుడ అటకెక్కి కూర్చున్నాడని సెటైర్ వేశారు. ఆయనిప్పుడు ఫామ్ హౌస్ లో హ్యాపీగా ఉన్నాడని ధ్వజమెత్తారు. గాంధీ కుటంబం గురించి మాట్లాడుతున్న కేటీఆర్ కు ఆ ఆర్హత లేదన్నారు. త్యాగాల కుటుబం గాంధీ కుటుంబం అయితే దోచుకున్న కుటుంబం కేసీఆర్ దన్నారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కట్టబెడితే కేసీఆర్ ఎక్కడున్నారు? కేటీఆర్, హరీశ్ రావు కొత్త అవతారం ఎత్తుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.


Similar News