త్వరలో విశాఖలో కేసీఆర్ భారీ బహిరంగ సభ : ఏపీ బీఆర్‌ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్

ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కొట్టి పారేశారు.

Update: 2023-01-18 05:06 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: విలువైన భూములు కట్టబెట్టడం వల్లే బీఆర్ఎస్ పార్టీలో చేరానని బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ రియాక్ట్ అయ్యారు. చిల్లర రాజకీయాల కోసమే నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన తోట చంద్రశేఖర్.. ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభ నుంచి మీడియా అటెన్షన్‌ను డైవర్ట్ చేయడానికే పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మియాపూర్ ల్యాండ్ విషయంలో రఘునందన్ రావు చేస్తున్న ఆరోపణలు నిజమైతే ఆ సర్వే నెంబర్ భూమిలో 90 శాతం తననే తీసుకోమని, మిగిలిన 10 శాతాన్ని నాకు ఇవ్వమని చెప్పండి అంటూ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతోందని, తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకే కేసీఆర్ బీఆర్ఎస్‌ను ఏర్పాటు చేశారని చెప్పారు. తెలంగాణ ప్రగతిని దేశానికి పరిచయం చేస్తామన్న ఆయన.. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ పట్నంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు.

దీనికి సంబంధించిన తేదీని త్వరలోనే ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. కాగా తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరడం వెనుక క్విడ్ ప్రో కో జరిగిందని రఘునందన్ రావు ఆరోపించారు. మియాపూర్‌లో రూ.4వేల కోట్ల విలువైన భూములను తోట చంద్రశేఖర్‌కు తెలంగాణ ప్రభుత్వం కట్టబెట్టిందని ఆరోపించారు. ఖమ్మంలో బీఆర్ఎస్ సభకు ఖర్చు తోట చంద్రశేఖర్ పెడుతున్నాడని ఇదంతా క్విడ్ ప్రో కో అని ఆరోపించారు. రఘునంద్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో ఆయన ఆరోపణలపై తోట చంద్రశేఖర్ రియాక్ట్ అయ్యారు. రఘునందన్ రావు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు.


Similar News