సెక్రటేరియట్ ఇనాగరేషన్ అంశంలో కేసీఆర్ ప్లాన్ ఛేంజ్
ఎలాంటి హడావుడి లేకుండా కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం సాదాసీదాగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: ఎలాంటి హడావుడి లేకుండా కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం సాదాసీదాగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. చీఫ్ గెస్టులను ఆహ్వానించడం, పబ్లిక్ మీటింగ్‌ను నిర్వహించే ఆలోచన లేదని సమాచారం. కేవలం సెక్రటేరియట్ ఎంప్లాయీస్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో పూజ కార్యక్రమాలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఎందుకంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కేసీఆర్ పిలిస్తే రాష్ట్రానికి వచ్చేందుకు ఇతర రాష్ట్రాల సీఎంలు, ప్రతిపక్ష లీడర్లు సుముఖంగా లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. ఈనెల 30న కొత్త సెక్రటేరియట్‌ను కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. ముహూర్తం తేదీనాటికి సెక్రటేరియట్‌లో పెండింగ్ పనులు పూర్తిచేయడంలో అధికారులు బిజీగా ఉన్నారు.
ఉద్యోగులే ముఖ్య అతిథులు
సెక్రటేరియట్ బిల్డింగ్ డిజైన్ మొదలుకొని ఏ శాఖ ఎక్కడ ఉండాలనే నిర్ణయం తీసుకునే వరకు అందులో పనిచేసే ఎంప్లాయీస్ అభిప్రాయాలను సీఎం కేసీఆర్ తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. బిల్డింగ్‌కు ముగ్గుపోసింది మొదలు నిర్మాణం పూర్తయ్యే వరకు అన్ని విషయాలను సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించారు. కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్‌కు సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అవసరం వచ్చిందనే టాక్ నెలకొంది.
ఎందుకంటే గతంలో తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా ఈసారి చీఫ్ గెస్ట్‌లు లేకుండా కేవలం ఎంప్లాయీస్ సమక్షంలోనే బిల్డింగ్ ఇనాగరేషన్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. పూజ కార్యక్రమాల తర్వాత ఎంప్లాయీస్ స్వాగతం మధ్య సీఎం కేసీఆర్ కొత్త బిల్డింగ్‌లోకి ఎంటరయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. బిల్డింగ్ ప్రారంభోత్సవం తర్వాత ఎంప్లాయీస్‌ను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగం ఉండే చాన్స్ ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
గతంలో హేమాహేమీలకు ఆహ్వానాలు
ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సెక్రటేరియట్‌ను ప్రారంభించేందుకు గతంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలనే ఉద్దేశంతో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ తరఫున జేడీయూ నేషనల్ ప్రెసిడెంట్ లాలన్ సింగ్‌లను ఆహ్వానించారు. ప్రారంభోత్సవం తర్వాత పరేడ్‌గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఎందుకో ఏమో కానీ ఆ ముహూర్తాన్ని వాయిదా వేసి, ఏప్రిల్ 30న ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.
రారనే ఆహ్వానించట్లేదా?
దేశంలో గుణాత్మక రాజకీయాలు కావాలని పదే పదే ప్రకటించిన సీఎం కేసీఆర్ టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా పేరు మార్చక ముందు పలు రాష్ట్రాలు తిరిగారు. అక్కడ సీఎంలు, ప్రతిపక్ష లీడర్లను కలిశారు. కానీ బీఆర్ఎస్ ప్రకటించిన తర్వాత కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీల లీడర్లను తక్కువ మందిని మాత్రమే కలిశారు. దేశంలో ఉన్న పలు ప్రాంతీయ, జాతీయ పార్టీలు వీలైతే కాంగ్రెస్ కూటమి, లేకపోతే బీజేపీ కూటమితో స్నేహంగా ఉంటున్నాయి.
కేసీఆర్ ప్రతిపాదించిన కాంగ్రెసేతర, బీజేపేతర కూటమి ఏర్పాటుకు సిద్ధంగా ఉన్న లీడర్లు కేసీఆర్‌తో కలిసి వచ్చేందుకు రెడీగా లేరు. నితీశ్ కుమార్ నేతృత్వంలోని కూటమి ఏర్పాటుకు మమత, అఖిలేశ్, తేజస్వీయాదవ్ సముఖత వ్యక్తం చేశారు. దీంతో సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి వారిని ఆహ్వానించినా హైదరాబాద్‌కు వచ్చేందుకు సుముఖంగా లేరని, అందుకే ఎవరినీ పిలవడం లేదని పార్టీ వర్గాల్లో టాక్ ఉంది.