విచక్షణ కోల్పోయిన KCR.. నల్లగొండ సభలో బండ బూతులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లాలో నిర్వహించిన సభలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సందర్భంలో విచక్షణ కోల్పోయి మంత్రులను బండ బూతులు తిట్టారు. ‘‘కేసీఆర్ ఛలో నల్లగొండ అంటే కేసీఆర్‌ను తిరగనివ్వం అని అంటరు. ఇంత మొగోళ్లా..? తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌నే తిరగనివ్వరా..?’’ అని ప్రశ్నించారు. పదేళ్లలో తెలంగాణకు తాము చేయాల్సిందల్లా చేశాం.. అయినా ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం, తమకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారని అన్నారు. ఏం పర్వాలేదని.. వెంటపడి మరీ సమస్యల పరిష్కారానికి కొట్లాడుతామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలు పక్కనబెట్టి కేవలం బీఆర్ఎస్ మీద విమర్శలు చేయడానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందా? అని అడిగారు. రెండు నెలలుగా కేసీఆర్‌ను రాష్ట్ర మంత్రులు తిట్టని రోజంటూ లేదని చెప్పారు.
‘‘కనీసం రైతుబంధు ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వానికి చేతనైత లేదు. ఇంత దద్దమ్మలా..? రైతుబంధు అడిగినోన్ని చెప్పుతో కొట్టమంటావా..? ఎన్ని గుండెల్రా మీకు..? ఎట్ల మాట్లాడుతారు.. కండకావరమా..? కండ్లు నెత్తికి వచ్చినాయా..? ప్రజలను అలా అనొచ్చా..? చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి. రైతుల చెప్పులు ఎట్ల ఉంటయి.. బందోబస్తుగా ఉంటాయి.. గట్టిగా ఉంటయి.. ఒక్క చెప్పు దెబ్బతో మూడు పళ్లు ఊసిపోతాయి. ఇది మర్యాదనా.. గౌరవమా..? ప్రజలను గౌరవించే పద్ధతా..? చేతకాకపోతే చెప్పాలి.. కానీ, మట్లాడే పద్ధతి ఇదా? అని సీరియస్ అయ్యారు. ‘‘దమ్ముంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం వద్ద కొట్లాడాలి.. అది మొగోడు చేయాల్సిన పని. ప్రజల మీద ప్రేమ ఉన్నోడు చేయాల్సిన పని. మీకేం కోపం వచ్చిందో.. ఏం భ్రమలో పడ్డరో.. పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నరు’’ అంటూ కేసీఆర్ ధ్వజమెత్తారు.