పేపర్ లీక్ కాకుండా చూడలేని అసమర్థుడు కేసీఆర్: Bandi Sanjay
రాష్ట్రంలో అన్ని లీక్ అవుతున్నా వాటిని నియంత్రించలేని అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్ అని బండి సంజయ్ ధ్వజమెత్తారు.
దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్‌పీఎస్సీ, టెన్త్ పేపర్లు రాష్ట్రంలో అన్ని లీక్ అవుతున్నా వాటిని నియంత్రించలేని అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పదవులు లేకపోతే బతకలేరా అని ప్రశ్నించారు. ఈ నెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన పూర్తిగా అధికారిక కార్యక్రమం అని అన్నారు.
ప్రధాని పర్యటన సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కె. లక్ష్మణ్‌లు పార్టీ ఇతర నేతలతో కలిసి మంగళవారం బండి సంజయ్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో బీజేపీని ఓడించేందుకు ఇతర పార్టీల ప్రచార ఖర్చులు పెట్టుకునేంత డబ్బు కేసీఆర్ వద్ద ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. దీనిపై కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ప్రపంచంలో అన్ని పార్టీలకు కేసీఆర్ నాయకుడు అవుతాడని సెటైర్ వేశారు.
తెలంగాణ రాక ముందు కేసీఆర్, కేటీఆర్ బతుకు ఎలా ఉంది ఇప్పుడు వారి జీవితాలు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. లక్షల కోట్లు వీళ్లకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎంతో బయట పెట్టాలన్నారు. మోడీ సర్టిఫికెట్‌పై కేసీఆర్ బిడ్డ కూడా మాట్లాడిందని వీళ్లు చదువుకున్న అజ్ఞానులని విమర్శించారు. వీళ్ల చదువు డ్రగ్స్, కమిషన్, దొంగ సారా దందాలకు ఉపయోగపడిందన్నారు. కేటీఆర్, కవితలు ముందు కేసీఆర్‌కు సంబంధించిన ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ సర్టిఫికెట్ బయటపెడ్డాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ అంటేనే అంతర్జాతీయ దొంగల ముఠా అని బీర్, రమ్ము, స్కాచ్ ఆ పార్టీ విధానాలుగా మారిపోయాయన్నారు. మోడీని ప్రపంచం కొనియాడుతోందని, రాజ్యాంగంలో చదువులకు పదవులకు సంబంధం లేదని ఉందన్నారు. పేపర్ లీక్‌పై కేసీఆర్ ఇప్పటి వరకు మాట్లాడటం లేదని, సమస్య వచ్చినప్పుడు మౌనంగా ఉండేందుకేనా ఆయన్ను ముఖ్యమంత్రి చేసింది అని నిలదీశారు. బీఆర్ఎస్ నాయకులు పైసల కోసం పేపర్ లీక్‌లు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తప్పు చేయనప్పుడు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించడానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. వరంగల్‌లో నిరుద్యోగ మార్చ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.