కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానపరిచాడు : Y S Sharmila

ముఖ్యమంత్రి కేసీఆర్ రిపబ్లిక్ డే వేడుకలు జరపకుండా రాజ్యాంగాన్ని అవమానపరిచారని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు.

Update: 2023-01-26 10:49 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ రిపబ్లిక్ డే వేడుకలు జరపకుండా రాజ్యాంగాన్ని అవమానపరిచారని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకొని తెలంగాణవాదంతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కేసీఆర్ ఆ రాజ్యాంగాన్నే గౌరవించట్లేదన్నారు. భారత రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ గారిని, ప్రజలను అవమానించారని తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను నియంత కేసీఆర్ కాలరాస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా, రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ అవమానించారన్నారు. ప్రజలకు ఎన్నో వాగ్ధానాలు ఇచ్చి నిలబెట్టుకోకుండా నియంతగా పాలిస్తున్నాడని విరుచుకుపడ్డారు. కేసీఆర్ హామీలు నిలబెట్టుకోవడానికి రాజ్యాంగం అడ్డొచ్చిందా అని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ, మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇంటికో ఉద్యోగం, మూడెకరాల భూమి, పోడుభూములకు పట్టాలు, మైనార్టీలకు రిజర్వేషన్లు, ఈ హామీలు నిలబెట్టుకోవడానికి ఇవన్నీ అమలు చేయడానికి కేసీఆర్‌కు రాజ్యంగాం అడ్డు వచ్చిందా అని నిలదీశారు.

ప్రజలు, ప్రతిపక్షాలు గొంతెత్తితే దాడులు చేయడం, అరెస్టులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం, పోలీసులను పని వాళ్లలా వాడుకుంటున్నారని మండిపడ్డారు. మీడియా, ప్రతిపక్షాలను గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారన్నారు. తెలంగాణలో భారత రాజ్యాంగం కంటే కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతుందన్నట్లు ఉందని షర్మిల అభిప్రాయపడ్డారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గణతంత్ర్య వేడుకలను విస్మరించి కేసీఆర్ తెలంగాణ ప్రజలనే కాదు దేశ ప్రజలను రాజ్యాంగాన్ని అగౌరవపరిచారని విమర్శలు గుప్పించారు. ఎంతో వైభవంగా పరేడ్ గ్రౌండ్స్‌లో జరగాల్సిన రిపబ్లిక్ డేను నిర్వహించకుండా దిగజారుతున్నారన్నారు. మరోవైపు, మహిళ అని కూడా చూడకుండా, గవర్నర్ పదవికి కూడా గౌరవం ఇవ్వకుండా అగౌరవపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు దీని గురించి ఆలోచించాలని సూచించారు.

ఇక, రిపబ్లిక్ డేను గౌరవించని ముఖ్యమంత్రి దేశాలను ఏలతారట అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గవర్నర్‌ను అగౌరపర్చినందుకు గవర్నర్‌కు, రిపబ్లిక్ డేను విస్మరించినందుకు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ను ఇంతగా అవమానపర్చినందుకు ఆమెకు తాము సంపూర్ణ సానుభూతి తెలుపుతున్నామన్నారు. కేసీఆర్‌కు నియంత పాలన అలవాటైపోయిందని... ప్రతిపక్షాలు ఏళ్లుగా బాధ్యత సరిగా నిర్వహించకపోవడం వల్లనే కేసీఆర్ నియంత పాలన కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవిలో ఉండే అర్హత లేదన్నారు. పదవికి రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రి చేయాలి లేదా ఎన్నికలకు పోవాలని షర్మిల డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి:    కేసీఆర్‌పై డైరెక్ట్‌గా తమిళిసై ఫైర్

Tags:    

Similar News