సీఎం పదవికి కేసీఆర్ గుడ్ బై?

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు తగ్గించడం లేదు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తో ఢీ కొట్టేందుకే ఆసక్తి చూపుతున్నా

Update: 2022-06-11 06:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు తగ్గించడం లేదు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తో ఢీ కొట్టేందుకే ఆసక్తి చూపుతున్నారు. జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్న కేసీఆర్.. తాను ఏర్పాటు చేయబోది ఫ్రంట్ కాదు.. కొత్త టెంటే అనే సంకేతాలు ఇచ్చేశారు. ఈ నెలాఖరులో కొత్త పార్టీకి అంకురార్పణ జరగబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో ఇంటి పార్టీగా కొనసాగిన టీఆర్ఎస్ ఇకపై భారత రాష్ట్ర సమితిగా అవతరించేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని టీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే హిందీ బెల్ట్ లో తనదైన చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్.. ఆ పనిని తెలంగాణలో కూర్చొని చేయాలంటే అసాధ్యం అనే మాట వినిపిస్తోంది. అందువల్ల త్వరలోనే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నారనే ఆసక్తికర చర్చ తెరపైకి వస్తోంది.

కుర్చీని వదులుకుంటే కేసీఆర్ పరిస్థితేంటి?

ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్లాలంటే సీఎం పదవికి గుడ్ బై చెప్పాలనే వాదన బాగానే ఉన్నా.. ఆ పదవిని కేసీఆర్ వదులుకుంటారా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ప్రస్తుతం కేసీఆర్ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తున్నారు. వారంతా తెలంగాణ సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ కు వెంట వెంటనే అపాయింట్ మెంట్స్ ఇస్తున్నారు. అదే పదవి లేకుంటే ఇంత సులువుగా అపాయింట్‌మెంట్లు లభిస్తాయా అనేది సందేహమే. ప్రస్తుతం టీఆర్ఎస్ లోనూ కేసీఆర్ కు ఉన్నతమైన గౌరవం ఉందంటే.. దానికి సీఎం హోదానే కారణమనే విశ్లేషణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చేజేతులా కేసీఆర్ తన పదవిని కాదనుకుంటారా? అనేది తేలాల్సిన విషయం.

గవర్నర్ దర్బార్ నుండి ప్రజల దృష్టి మళ్లించడానికేనా?

రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వినడానికి గవర్నర్ తమిళిసై శుక్రవారం రాజ్ భవన్ లో మహిళా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. తాము ఎదుర్కొంటున్న కష్ట నష్టాలను బాధితులు గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. వారితో ముచ్చటించిన గవర్నర్ మీ అందరి కోసం తాను ఉన్నానంటూ అభయ హస్తం ఇచ్చారు. ఈ ప్రోగ్రాంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మహిళల సమస్యల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదని బాధితులంతా గవర్నర్ ను ఆశ్రయిస్తుండటమే నిదర్శనమనే మాటలు వినిపించాయి. అయితే గవర్నర్ వైఖరిని తప్పుపట్టిన టీఆర్ఎస్.. ఆమె చర్యలు ప్రభుత్వానికి, పార్టీకి ఇబ్బందికరంగా మారుతాయనే ఆలోచనకి వచ్చిందట. అందువల్లే స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి మహిళా దర్బార్ టాపిక్ నుండి మీడియా, ప్రజల దృష్టిని మళ్లించడానికి మరోసారి జాతీయ రాజకీయాలపై చర్చకు తెరలేపారనే టాక్ వినిపిస్తోంది. గతంలో అనేక సందర్భాల్లో నేషనల్ పాలిటిక్స్ గురించి మాట్లాడిన కేసీఆర్.. ఆ తర్వాత సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. ఓ వైపు రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడగా.. ఆ అంశాన్ని లైట్ తీసుకోవాలని చెబుతూనే జాతీయ పార్టీ ప్రస్తావన తీసుకురావడం వెనుక ఇదే అసలైన రీజన్ అనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రత్యర్థులను కన్ఫ్యూజన్ లోకి పడేసే కేసీఆర్ తాజా ఆలోచన, పరిణామాలు ఎలాంటి సెన్సేషన్ కు కారణమవుతాయో తెలియాలంటే ఎదురుచూడాల్సిందే.


Similar News