కేసీఆర్ ఓయూకు చేసింది శూన్యం: చనగాని దయాకర్
కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీ కోసం చేసింది శూన్యం అని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ ప్రకటించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీ కోసం చేసింది శూన్యం అని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ ప్రకటించారు. బుధవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేశాడన్నారు. ప్రధానంగా ఓయూ భూములు అమ్ముకున్నాడన్నారు. నిధులు మింగేశాడన్నారు. నియామకాలు లేకుండా చేసి, నిరుద్యోగులను రోడ్లపై పడేశాడన్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేవన్నారు. ఓయూ సెంచరీ ఉత్సవాలకు రూ. 200 కోట్లు ప్రకటించి, కేవలం రూ. 50 కోట్లు ఇచ్చి చేతులు ఎత్తేశాడన్నారు. ఇక కేటీఆర్ సన్నిహితుడి దోస్తు కంపెనే మాగ్నైట్ సొల్యూషన్ సాఫ్ట్వేర్ కు ప్రభుత్య యూనివర్సిటీల ఆన్లైన్ వాల్యువేషన్ టెండర్ ఇచ్చారని, దీని వలన మూడింతల ఖర్చు పెరిగిందన్నారు.
గడిచిన పదేళ్లలో ఒక్క అధ్యాపక పోస్ట్ కూడా భర్తీ చేయలేదన్నారు. గతంలో 1200 పోస్టులు ఉంటే ఇప్పుడు ఓయూ లో కేవలం 320 పోస్టులు మాత్రమే ఉన్నాయన్నారు. కేసీఆర్ పదేళ్లలో కొత్త ఉద్యోగాలు చేపట్టలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్యం తెలంగాణ యూనివర్సిటీల విద్యార్థులకు, పరిశోధక స్టూడెంట్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజీవ్ గాంధీ ఫెలోషిప్ పేరు మీద రూ. 25 వేలు, నాన్నెట్ ఫెలోషిప్ రూ. 8 వేల చొప్పున ఉండేవన్నారు. కేసీఆర్ హయంలో బేగంపేట్, రంగాపూర్ సెసైన్స్ అబ్జర్వేషన్ భూముల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో విద్యార్ధులను నిర్భందాలకు గురి చేసి ముళ్ల కంచెలు, అడ్డుగోడలతో ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేశారన్నారు. ప్రశ్నించే విద్యార్ధి నాయకులను తీవ్రంగా గాయపరిచారన్నారు.