ధరణి పోర్టల్‌లో CM KCR వివరాలే తప్పు..! ఎన్నికల వేళ హాట్‌టాపిక్‌గా మారిన ఇష్యూ
‘ధరణిని ఎందుకోసం తెచ్చినం? రికార్డులు పారదర్శకంగా ఉండాలి.
దిశ, తెలంగాణ బ్యూరో : ‘ధరణిని ఎందుకోసం తెచ్చినం? రికార్డులు పారదర్శకంగా ఉండాలి. రైతుల భూమి మీద హక్కులు వాళ్లకే ఉండాలె. అంతకు ముందు ఆర్ఐ, ఎమ్మార్వో, ఆర్డీవో.. ఇట్లా ఒక రైతుకు 8 మంది భర్తలు ఉండేది. ఎవరికి కోపం వచ్చినా కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్లే అయ్యేది. భూమి తెల్లారేసరికి వేరేవాళ్ల పేరు మీదికి రాసేటోళ్లు. మళ్లా మార్చాలంటే లంచం ఇవ్వాలనేవారు. భూమిపై ధరణి ద్వారా రైతులకే అధికారం ఇచ్చినం. ఆ అధికారాన్ని ఉంచుకుంటరా? పోగొట్టుకుంటరా? ఆలోచించండి..’ అంటూ సీఎం కేసీఆర్ ఎన్నికల సభల్లో జనాన్ని భయపెడుతున్నారు.
పెండింగ్‌లో లక్షలాది అప్లికేషన్లు..
‘ముఖ్యమంత్రి గారికి ధరణిలో ఒక గుంట భూమి ఎక్కువ ఎక్కింది. కానీ చాలామందికి తక్కువ ఎక్కింది. వాళ్లు 3 సంవత్సరాలుగా చెప్పులు అరిగేలా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. సీఎంకు ఎక్కువ ఎక్కిన గుంట భూమిని కూడా సరిచేయలేకపోయారు. అంటే ధరణిలో లోపాలు ఉన్నాయని అర్థం కాదా’ అంటూ ధరణి పోర్టల్ బాధితులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ‘మీకు గుంట భూమి అదనంగా ఎందుకు వచ్చింది? దానికి బాధ్యులు ఎవరు? వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? మూడేండ్లయినా రికార్డు ఎందుకు సరి చేయలేదు? అదనంగా వచ్చిందని సైలెంట్‌గా ఉన్నారు. మరి ఎకరాల కొద్ది భూమి మిస్సయ్యింది.
ఒకరి పేరిట ఉండాల్సిన భూమిని మరొకరికి పేరిట రాశారు. సర్వే నంబర్లు మిస్ చేశారు.. అలాంటి వాళ్లు లక్షల్లో ఉన్నారు. మూడేండ్ల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మరి భూమి తక్కువగా నమోదైన వారి ఆవేదన, ఆందోళన ఎందుకు కనిపించడం లేదు‘ అని ప్రశ్నిస్తున్నారు. టీఎం 33 మాడ్యూల్ కిందనే లక్షల్లో అప్లికేషన్లు వచ్చాయి. అందులో అనేకం పెండింగులోనే ఉన్నాయి. తప్పు చేశాం.. ఐతేంది? కోర్టుకు వెళ్లండంటూ అధికారులు చెప్తున్నారు. ఇన్ని కళ్ల ముందు కనిపిస్తున్నా తాము గొప్ప భూ పరిపాలన విధానాన్ని అమలు చేస్తున్నామంటూ ప్రచారం చేస్తుండడం పట్ల బాధితులు మండిపడుతున్నారు.
గుంట ఎక్కువ నమోదు
ధరణి అద్భుతమంటూ కీర్తిస్తున్నారు. కానీ తాజాగా సీఎం నామినేషన్‌తో పాటు సమర్పించిన అఫిడవిట్‌లో ధరణి పోర్టల్ తప్పిదాన్ని అధికారికంగా అంగీకరించడం విశేషం. పేజీ నం.27లో తనకు ఉండాల్సిన భూమి కంటే ఒక గుంట అదనంగా నమోదు చేశారని స్వయంగా సీఎం పేర్కొన్నారు. 1 బీ ప్రకారం 53.31 ఎకరాలు. కానీ పట్టాదారు పాసు పుస్తకం ప్రకారం 53.30 ఎకరాలే. గుంట ఎక్కువగా ఉంది. దీని మొత్తం విలువ రూ.1,35,116 గా పేర్కొన్నారు.
హాట్ టాపిక్ .. భూమి..
ధరణి పోర్టల్ రద్దు చేస్తామని, మెరుగైన వ్యవస్థను తీసుకొస్తామంటూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చింది. బీజేపీ కూడా అదే బాటలో నడుస్తున్నది. బీఆర్ఎస్ మాత్రం అది అద్భుతమని, రద్దు చేస్తే పటేల్, పట్వారీ వ్యవస్థ వస్తుందని, ఒకరి భూమి మరొకరి పేరిట రాస్తారంటూ జనాన్ని భయపెడుతున్నారు. దానికి తోడు రైతుబంధు కూడా రాదంటూ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది ధరణి పోర్టల్ బాధితులు తమ రికార్డులు తప్పుగా పడ్డాయంటూ దరఖాస్తు చేసుకున్నారు.
ఏండ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కోర్టులను ఆశ్రయించిన వారూ ఉన్నారు. ఆఖరికి కేసీఆర్ మంత్రివర్గంలోని వారు కూడా పట్టా భూమిని వక్ఫ్‌గా చేర్చారంటూ హైకోర్టును ఆశ్రయించిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. సీఎంకు అదనంగా ఎక్కిన ఆ గుంట భూమి ఎవరిని నష్టపరిచింది? ఎవరో ఒక రైతుకు తక్కువ చేసి కేసీఆర్ ఖాతాలో జమ చేసినట్లే కదా.. ఇలాంటి తప్పిదాలు ధరణి పోర్టల్ డేటాలో ఎన్నెన్నో దర్శనమిస్తాయి. ఇలాంటి నేపథ్యంలో నడుస్తున్న ధరణి పోర్టల్ రద్దు చేయాలా? సమూలంగా మార్చాలా? ఉన్నది ఉన్నట్లుగా కొనసాగించాలా? అన్న చర్చ జోరుగానే నడుస్తున్నది. ధరణి అద్భుతమని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు మినహా ఇతర మంత్రులు దాని ముచ్చట పెద్దగా ఎత్తడం లేదు.
లోపాల ధరణితో నష్టమే
మూడున్నరేండ్ల తర్వాత కూడా భూ సమస్యల పరిష్కారం కొలిక్కి రాలేదు. సాంకేతిక సమస్యలను అధిగమించలేదు. ప్రతి రోజూ సీసీఎల్ఏ కార్యాలయానికి వచ్చే సామాన్య రైతులను చూస్తేనే అది అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ‘ధరణి’ పోర్టల్ పెద్ద గుదిబండలా మారుతున్నది. భూ సమస్యల పరిష్కారానికి మాడ్యూళ్లు ఇచ్చామంటున్న ప్రభుత్వం.. వాటి అమలుతీరుపై సమీక్షించడం లేదు. ప్రధానంగా టీఎం 33 మాడ్యూల్ ద్వారా సుమారు 3 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు సమాచారం. అందులో 30 శాతం పరిష్కారానికి నోచుకోలేదు. 70 శాతం తిరస్కరణ లేదా పెండింగులోనే ఉన్నాయి. ఇంకా అనేక మంది విస్తీర్ణం తక్కువ/ఎక్కువ, సర్వే నంబరు మిస్సింగ్ వంటి సమస్యలను గుర్తించలేదు. పట్టాదారు పాసు పుస్తకంలో ఉన్నప్పటికీ ధరణి పోర్టల్ లో అదృశ్యమయ్యాయి.
దిక్కుతోచని అధికారులు..
రెండున్నరేండ్లుగా ఆప్షన్ రాలేదంటూ తప్పించుకున్నారు. ఇప్పుడేమో సాంకేతిక సమస్య, సర్వే నంబరులో విస్తీర్ణం ఎక్కువగా ఉందంటూ తిరస్కరిస్తున్నారు. అది పరిష్కరించాలంటే ఆ సర్వే నంబరులోని ఏదైనా ఓ రైతు ఖాతా నుంచి ఆ మేరకు విస్తీర్ణాన్ని తొలగించాలన్న మెలిక పెడుతున్నారు. అదెట్లా చేయగలమని తహశీల్దార్లు తల పట్టుకుంటున్నారు. ఎవరి ఖాతాలో నుంచి తొలగించినా గొడవ పెట్టుకుంటారన్న భయం పట్టుకున్నది. ఇక పాత రికార్డులన్నీ వెరిఫై చేసి ఏ దశాబ్దంలో పొరపాటు జరిగిందో తెలుసుకొని ఆ మేరకు రిపోర్ట్ ఇవ్వాలంటూ సీసీఎల్ఏ నుంచి మౌఖిక ఆదేశాలిస్తున్నారు.
ఇప్పుడీ భారాన్ని తాము మోయలేమంటూ తహశీల్దార్లు చేతులెత్తేస్తున్నారు. ఐతే దరఖాస్తును పరిశీలించి సదరు పట్టాదారుడు నిజాయితీగా ఆ భూమిని కొనుగోలు చేశారని, ఎంట్రీ చేయాలంటూ తహశీల్దార్లు నివేదికలను కలెక్టర్లకు పంపిస్తున్నారు. వాటిని పరిశీలించిన కలెక్టర్లు అప్లికేషన్లను అప్రూవ్ చేస్తున్నారు. కానీ ఆర్ఎస్ఆర్ విస్తీర్ణంలో తేడా ఉందంటూ సీసీఎల్ఏ తిరస్కరిస్తుండడం పెద్ద వివాదానికి దారి తీస్తున్నది. తాము చేయాలనుకున్నా టెక్నికల్ ఎర్రర్ అని వస్తుందంటూ తప్పించుకుంటున్నారు. ఇప్పుడీ అప్లికేషన్లను పరిష్కరించాలంటే ఏ రైతు ఖాతాలో ఎక్కువగా నమోదైందో పరిశోధన చేస్తే తప్ప మరో మార్గం లేదు. అప్పటి దాకా టీఎం 33 కింద వచ్చిన అప్లికేషన్లకు మోక్షం లభించేటట్లు లేదు.
సర్వేతోనూ కష్టమే..
తెలంగాణలో భూమి ఎంత ఉంది? రైతుల పేరిటా అంతే ఉందా? ఎందుకు ఎక్కువ విస్తీర్ణం కనిపిస్తున్నది? ఏదైనా సర్వే నంబరులో సేత్వార్ ప్రకారం ఎంత విస్తీర్ణం ఉండాలి? ఇప్పుడా సర్వే నంబర్లలోని రైతుల పేరిటనున్న విస్తీర్ణం మొత్తం ఎంత? ఎందుకు పెరిగింది? సరిదిద్దాలంటే కొత్త భూమిని పుట్టిస్తారా? లేదంటే ఎవరి పేరిటనున్న భూమిని తగ్గించి ఆ వ్యత్యాసాన్ని లెవెల్ చేస్తారా? ఇదే అతిపెద్ద భూ సమస్య. ఒకటీ రెండు సర్వే నంబర్లలో కాదు. ప్రతి ఊరిలోనూ 10 నుంచి 15 శాతం సర్వే నంబర్లలో సేత్వార్ (ఆర్ఎస్ఆర్) కంటే ప్రస్తుతం ఉన్న రికార్డుల్లోని భూమి ఎక్కువగా ఉందని రెవెన్యూ అధికారులే చెప్తున్నారు.
లేని భూమికి హక్కులు పొందారు. సమగ్ర భూ సర్వే చేసినా ఎవరి ఖాతాలో నుంచి తొలగించాలో అంతుచిక్కని పరిస్థితి. పరిష్కార మార్గాలేవీ ధరణి పోర్టల్ చూపలేదు. ధరణిలో నమోదు చేసిన భూ విస్తీర్ణానికి, వాస్తవ భూ విస్తీర్ణానికి మధ్య వ్యత్యాసం ఉందని అధికారులకీ తెలుసు. అనాదిగా అధికార యంత్రాగం చేసిన తప్పిదాల కారణంగానే రికార్డుల్లో భూమిని పెంచేశారు. విక్రయించిన భూమిని సదరు రైతు ఖాతా నుంచి తొలగించకుండానే కొత్త సబ్ డివిజన్ ఏర్పాటు చేయడంతో తలెత్తిన వ్యత్యాసాలే అధికం.
ధరణి బాగుంటే.. ఇవి ఎట్లా?
సర్వే నంబరు మిస్సయ్యిందని, విస్తీర్ణం తక్కువగా నమోదు చేశారని దరఖాస్తు చేసుకుంటే ఆర్ఎస్ఆర్ విస్తీర్ణం వ్యత్యాసం ఉందని రిజెక్ట్ చేస్తున్నారు.
రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు? బాధ్యులెవరు?
ఏ ఆధారాన్ని బట్టి వాళ్లు రిజెక్ట్ చేస్తున్నారు? దానికి మెమో ఇచ్చి కారణం చెప్పరా?
రికార్డు పరంగా వ్యత్యాసం ఉంటే... సవరించాల్సిన రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? సర్వేయర్ ఎందుకు ఉన్నట్టు?
అసలు ఆ సర్వే నంబరులో భూమి లేని వాడిని తొలగించడమో లేదా అర్జీదారుడి భూమి నిర్ధారించి తదనుగుణంగా రికార్డు సవరించడానికి ఉన్న అడ్డంకులు ఏంటి?
సమస్యని పరిష్కరించాల్సిందెవరు?
ధరణిలో ఆర్ఎస్ఆర్ విస్తీర్ణం వ్యత్యాసం ఉన్నా ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ కమ్ మ్యుటేషన్ జరుగుతున్నప్పుడు మిస్సయ్యిందంటూ అప్లికేషన్లు పెట్టుకునే వారికే ఈ ఇబ్బంది ఎందుకు?