రేవంత్ పై కేసీఆర్ వ్యూహం ఫలించేనా?
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్ధి పేరు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది
దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్ధి పేరు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధిగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు బరిలో ఉంటారని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ముఖ్యనేతలు, కార్యకర్తలతో భేటీ నిర్వహించిన ఆయన.. సమావేశం అనంతరం పద్మారావు పేరును ఖరారు చేశారు. తెలంగాణలో ఇప్పటివరకు 14 పార్లమెంటు స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన కేసీఆర్, మరో మూడు స్థానాలపై తీవ్ర కసరత్తులు చేస్తున్నారు.
ముందుగా సికింద్రాబాద్ అభ్యర్ధిగా పార్టీలోని పలువురు కీలక నేతల పేర్లు వినిపించినా, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మె్ల్యేగా ఉన్న దానం నాగేందర్ ను పార్టీలో చేర్చుకొని సికింద్రాబాద్ అభ్యర్ధిగా ఖరారు చేయడంతో కేసీఆర్ మనసు మార్చుకున్నారు. పార్టీ మారిన దానం నాగేందర్‌ను దెబ్బ కొట్టాలని స్కెచ్‌తో ఆ పార్లమెంట్ పరిధిలో మాస్ లీడర్‌గా పేరున్న పద్మారావు గౌడ్ పేరు తెర మీదకు తెచ్చినట్లు తెలుస్తొంది. సికింద్రాబాద్ నుంచి పోటీ చేసేందుకు పద్మాదావు గౌడ్ ముందుగా విముఖత చూపి, తన కుమారుడు రామేశ్వర్ కు సీటు కేటాయించాలని కోరినట్లు వార్తలొచ్చాయి. దీంతో కేసీఆర్ రంగంలోకి దిగి, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం గెలిచిన అనంతరం జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో.. రామేశ్వర్ కి టికెట్ కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో పద్మారావు పోటీకి సై అన్నట్లు తెలుస్తొంది.
కేసీఆర్ నిర్ణయంతో సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎలక్షన్ ఈక్వేషన్స్ ఒక్కసారిగా మారిపోయాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే ఇద్దరు అభ్యర్ధులు కూడా ఎమ్మెల్యేలు, పైగా మాస్ లీడర్లుగా పేరున్న వారు కావడంతో సికింద్రాబాద్ ఎన్నిక మరింత రసవత్తరంగా మారిపోయింది. ఇప్పుడు ఈ పార్లమెంటు పరిధిలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేల మధ్య ఎంపీ సీటు కోసం ఫైటింగ్ లా అయ్యింది. ఇక రేవంత్ రెడ్డి వ్యూహాన్ని తిప్పికొట్టాలన్న కేసీఆర్ పంతం నెగ్గుతుందో లేదో చూడాలి.