తెలంగాణలో బీజేపీ చాప్టర్ క్లోజ్.. ఆ పార్టీ గెలిచేది కేవలం నాలుగైదు స్థానాలే: CM సిద్ధరామయ్య

అవినీతి డబ్బుతో కేసీఆర్ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు, కానీ తెలంగాణ ప్రజలు అవినీతి కేసీఆర్ సర్కార్‌ను ఓడించాలని నిర్ణయించుకున్నారని కర్నాటక సీఎం సిద్ధరామయ్య

Update: 2023-11-10 10:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: అవినీతి డబ్బుతో కేసీఆర్ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు, కానీ తెలంగాణ ప్రజలు అవినీతి కేసీఆర్ సర్కార్‌ను ఓడించాలని నిర్ణయించుకున్నారని కర్నాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ కామారెడ్డిలో తలపెట్టిన ప్రజా గర్జన సభలో ఆయన మాట్లాడారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రెండు నియోజకవర్గాల్లో గెలుస్తారని, కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి ఓడిస్తాడనే నమ్మకం ఉందన్నారు. ఈ నెల 30వ తేదీ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, డిసెంబర్ 3న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్ దళితులు, వెనకబడిన వర్గాలను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.

తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందని, బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ వందసార్లు వచ్చి తెలంగాణలో ప్రచారం చేసిన బీజేపీ గెలిచే అవకాశం లేదన్నారు. తెలంగాణలో బీజేపీ నాలుగైదు సీట్లు గెలిస్తే ఎక్కువ అని సెటైర్ వేశారు. బీజేపీ ఈ ప్రధాని మోడీని నమ్ముకుని ఈ ఎన్నికలకు వెళ్తుందని, కానీ కర్నాటకలో ప్రధాని మోడీ 48 చోట్ల సభలు నిర్వహిస్తే ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించిందన్నారు. మోడీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతారని, ఇటీవల హైదరాబాద్ లో జరిగిన బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో కూడా ఆయన అబద్ధాలే చెప్పారన్నారు. మోడీలా అబద్ధాలు మాట్లాడే ప్రధానిని ఇంతవరకు చూడలేదని ధ్వజమెత్తారు.

Tags:    

Similar News