ఆ భూమి లెక్క తేలేదెన్నడు..? ఆ మూడు శాఖల చుట్టూ స్థల వివాదం

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో కేంద్రంలో ఓ భూమి వ్యవహారం మూడు ప్రభుత్వ శాఖల చుట్టూ తిరుగుతోంది.

Update: 2024-09-30 01:36 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి, కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో కేంద్రంలో ఓ భూమి వ్యవహారం మూడు ప్రభుత్వ శాఖల చుట్టూ తిరుగుతోంది. ఫారెస్ట్ ఆఫీస్ పక్కనే ఉన్న సర్వే నెం.903లో గల ఖాళీ స్థలం 50 ఏళ్లుగా ఓ కుటుంబం ఆధీనంలో ఉంది. అయితే, ఇటీవల ఆ స్థలంలో ఏర్పాటు చేసిన చిన్న షెడ్డు పెద్ద వివాదానికి దారి తీసింది. సదరు స్థలం గ్రామ కంఠం అని అక్రమంగా నిర్మాణం చేస్తున్నారని పేర్కొంటూ ఓ వ్యక్తి కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. దానిపై విచారణ జరిపిన ఎంపీవో రిపోర్ట్ తయారు చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. కాగా, పంచనామాలో ఏకంగా రెవెన్యూ, పంచాయతీ రాజ్, అటవీ శాఖల ప్రస్తావన రావడంతో నిర్మాణం సంగతి అంటుంచితే అసలు ఆ భూమి ఎవరిది? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. చిన్న భూ సమస్యను తేల్చలేకపోతున్న మూడు శాఖల ఆఫీసర్ల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే బాధితులు మాత్రం 50 ఏళ్ల కింద తమకు అప్పటి ప్రభుత్వం రెవిన్యూ శాఖ ద్వారా అసైన్డ్ ల్యాండ్ కింద ఇచ్చిందని తేల్చి చెప్తున్నారు.

వివాదాస్పదంగా ఎంపీఓ నివేదిక.

షెడ్డు నిర్మాణం విషయంలో ఫిర్యాదు రావడంతో ఎంపీఓ వాసవి ఎంక్వయిరీ చేపట్టారు. ఈ సందర్భంగా రాసిన ఎంక్వయిరీ రిపోర్టు వివాదాస్పదంగా మారింది. రిపోర్ట్‌లో సదరు ల్యాండ్ అటవీ శాఖ నుంచి ప్రస్తుతం కబ్జాకు ఉన్న వ్యక్తులు పొందినదిగా ఫిర్యాదుదారుడు తెలిపినట్లుగా రాశారు. మరోవైపు అదే భూమి‌ని 1978లో అప్పటి జగిత్యాల రెవిన్యూ కార్యాలయం నుంచి కబ్జాదారులు ఒక సంవత్సరానికి సాగుకు తీసుకున్నట్లుగా ఇక అప్పటి నుంచి వాళ్ల ఆధీనంలోనే ఉన్నట్లుగా ఫిర్యాదుదారుడు పేర్కొన్నట్లుగా రాశారు. 50 ఏళ్లుగా కబ్జాలో ఉంటున్నప్పటికీ జీపీ నుంచి పర్మిషన్ లేకుండా అక్రమంగా షెడ్డు నిర్మాణం చేసినట్లు నివేదిక ఇచ్చారు. ఎంపీవో రిపోర్ట్ ఆధారంగా ఆ స్థలం గ్రామకంఠం భూమిగా అందులో అనుమతులు లేకుండా వేసిన షెడ్డు‌ను తొలగించాలని డీపీవో ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, కూల్చివేత సమయంలో బాధితులతో పాటు స్థానికులు అడ్డు చెప్పడం‌తో ఆ ప్రక్రియ‌కు బ్రేకులు పడ్డాయి. అక్రమ నిర్మాణం విషయంలో అధికారుల స్పందన బాగానే ఉన్నా మరో రెండు శాఖల ప్రస్తావన రావడం చర్చనీయాంశం అయింది. ఎంపీవో ఆ స్థలం విషయంలో అసలు ఆయా శాఖల ఆఫీసర్లను ఆరా తీసారా? వారికి రికార్డుల పరిశీలనకై లేఖలు ఏమైనా రాశారా? అసలు వారిని సంప్రదించారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ప్రభుత్వ భూమి‌గా ఫ్లెక్సీ ఏర్పాటు

సంబంధిత స్థలం ప్రభుత్వ భూమి అని అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేయకూడదని జీపీ సిబ్బంది ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. గ్రామకంఠం భూమి అయితే జీపీ సిబ్బంది ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలే తప్ప సర్వే నంబర్ ఉన్న భూమిలో ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అక్రమ నిర్మాణాలు జరిగినట్లయితే సంబంధిత స్థలం ఎవరికి చెందినదో ముందు సర్వే చేసి తేల్చిన తరువాతే ఇలాంటి చర్యలు చేపట్టాలి కదా అని స్థానికులు అంటున్నారు. మరోవైపు సర్వే నెం.903లో ఉన్న చాలా భూముల్లో గతంలో అనేక మంది ఇండ్లు నిర్మించగా జీపీ సిబ్బంది అనుమతులు ఇచ్చి రివిజన్ రికార్డుల్లో నమోదు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. తాము కూడా ఇంటి పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోగా ఇవ్వకపోవడం‌తోనే గత్యంతరం లేక చిన్న రూమ్ వేసుకున్నట్లు బాధితులు చెప్తున్నారు.

జాయింట్ సర్వేకు డిమాండ్లు

గ్రామ ప్రజలు నివసించడానికి ప్రభుత్వం వదిలి వేసిన భూములే గ్రామ కంఠం భూములు. ఆ భూములకు సాధారణంగా సర్వే నెంబర్లను కేటాయించరు. ఇలాంటి భూముల్లో ఉన్న ఇండ్లను ఇంటి నెంబరు లేదా సంబంధిత గ్రామ పంచాయతీకి కడుతున్న టాక్స్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గ్రామాలలో ఉన్న భూములు, ఇండ్లను జీఓ నెం.187 ప్రకారం, మున్సిపల్ పరిధిలో విలీనమైన గ్రామ కంఠం భూములు ఇండ్లను జీఓ నెం.361 ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకునే వెసలు బాటు ప్రభుత్వం కల్పించింది. అయితే కొడిమ్యాలలో వివాదాస్పద స్థలానికి సర్వే నెంబర్ ఉండగా స్థానిక పంచాయతీరాజ్ శాఖ ఆఫీసర్లు మాత్రం గ్రామకంఠం భూమిగా పేర్కొనడం అనుమానాలకు తావునిస్తుంది. ఈ భూమి మిస్టరీ వీడాలంటే జాయింట్ సర్వే చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

50 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం: చెన్న నరేందర్, బాధితుడు

తాము ఉన్నది గ్రామ కంఠం భూమి కాదు. 50 ఏళ్ల కింద ప్రభుత్వం 903 సర్వే నంబర్‌లో రెవిన్యూ భూమి‌ని ఇచ్చింది. 50 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం కావాలంటే అధికారులు చుట్టు పక్కల ఎంక్వయిరీ చేసిన తర్వాతనే మాకు న్యాయం చేయండి. న్యాయం చేయాలని ఇదివరకే కలెక్టర్, ఆర్డీఓ ఆఫీసుల్లో చాలా సార్లు కలిశాం.


Similar News