ఆరు గ్యారంటీల అమలు ఎప్పుడు?

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన 6 గ్యారంటీల అమలు ఎప్పుడు అని బండి సంజయ్ ప్రశ్నించారు.

Update: 2024-03-10 12:10 GMT

దిశ, మల్యాల: కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన 6 గ్యారంటీల అమలు ఎప్పుడు అని బండి సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ప్రతి మహిళ అకౌంట్‌లో రూ. 2500 వేయాలని ఆయన అన్నారు. ప్రజాహిత యాత్రలో భాగంగా మల్యాల మండలంలో పర్యటించిన బండి సంజయ్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే రైతులకు రెండు లక్షల రుణమాఫీకి, మహిళకు రూ. 2500 రూపాయలు, కౌలు రైతులకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని అన్న మాటను జీవో విడుదలకే పరిమితం చేయకుండా బడ్జెట్ ప్రవేశపెట్టి నిధులను కేటాయిస్తూ 6 గ్యారంటీలు అమలయ్యేటట్టుగా చూడాలని ఆయన కోరారు. కేసీఆర్ మాటల మట్టుకే ఆలయాల అభివృద్ధి అని ఆయన అన్నారు. వేములవాడకు కొండగట్టుకు కెసీఆర్ కేటాయించిన రూ. 600 కోట్లు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నుండి వేములవాడకు దూప దీప నైవేద్యాల నిధులు వచ్చేలా చేద్దాం అంటే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి ఇవ్వలేదని ఆయన అన్నారు.

ప్రజలు కాంగ్రెస్ బీఆర్ఎస్ చెప్పే మాటలకు మోసపోవద్దని రాబోయే పార్లమెంట్ ఎలక్షన్‌లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను ఎంపీగా గెలిపించాలని ఆయన కోరారు. కేంద్రంలో మోదీ ఉంటేనే దేశం రామరాజ్యంగా విరాజిల్లుతుందని ఆయన అన్నారు. చొప్పదండి నియోజకవర్గంలో మల్యాల మండలంలో జరిగిన అభివృద్ధి పనుల్లో కేంద్రం కేటాయించిన నిధులను ఆయన వివరించారు. ఉపాధి హామీ, ఫ్రీ రేషన్ బియ్యం, రహదారుల నిర్మాణం, రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులలో కేంద్ర యొక్క వాటా ధనం గురించి ఆయన ప్రజలకు వివరించారు.

ప్రజాహితయాత్రలో భాగంగా ఆదివారం రోజున ఉదయం మండల కేంద్రంలోని తాటిపల్లి గ్రామానికి వచ్చిన బండి సంజయ్ కుమార్ స్థానిక ఆలయంలోని ఆంజనేయ స్వామిని దర్శించుకొని వివేకానంద విగ్రహం వద్ద ఉన్న భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించారు. తాటిపల్లి నుండి కొంపల్లి, లంబాడి పెళ్లి, తక్కళ్లపల్లి, మ్యాడంపల్లి మీదుగా మల్యాల , మద్దుట్ల , పోతారం వరకు ప్రజాహిత యాత్ర కొనసాగింది. ఈ బీజేపీ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ,ప్రజలు పాల్గొన్నారు.


Similar News