రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం

రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారి ఆర్వీ కర్ణన్ అన్నారు.

Update: 2024-11-06 10:33 GMT

దిశ, తంగళ్లపల్లి : రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారి ఆర్వీ కర్ణన్ అన్నారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల, నేరెళ్ల, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాల, పెద్ద బోనాల, ముష్టిపల్లిలోని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో  కలిసి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

    ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు, కాంటా వేసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని కోరారు. ఆయా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. జిల్లాలో ఐకేపీ, మెప్మా, పీఏసీఎస్, డీసీఎంఎస్ విభాగాల ఆధ్వర్యంలో ఇప్పటికే 248 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. సీసీఐ ఆధ్వర్యంలో దాదాపు ఐదు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. వరి, పత్తి పండించిన రైతులు తమ పరిధిలోని కేంద్రాలకు పంట ఉత్పత్తులను తరలించాలని సూచించారు.

స్టాంపింగ్ వేయాలి

కొనుగోలు కేంద్రాల నుంచి తరలించే ధాన్యం బస్తాలపై సెంటర్ పేరు సరిగ్గా కనిపించేలా ముద్ర వేయాలని ఆదేశించారు. ఆయా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలపై వేసిన స్టాంపులు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ముందుకు వచ్చే రైస్ మిల్లర్లకు ధాన్యం కేటాయించాలని సూచించారు.

    ఎవరూ ముందుకు రాకపోతే ప్రత్యామ్నాయంగా ఉన్న గోదాములకు తరలించాలని ఆదేశించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. ఇక్కడ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాధాభాయ్, తంగళ్లపల్లి తహసీల్దార్ జయంత్ కుమార్, మెప్మా డీఎంసీ రాజేశం, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. 


Similar News