వాల్ట ఉల్టా పల్టా.. అనుమతులు లేకుండా తవ్వకాలు..
ఎల్లారెడ్డి పేట మండలంలో కొంతమంది బోరు బండ్ల యజమానులు వాల్ట చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకుని ఉల్టా పల్టా చేస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దిశ, ఎల్లారెడ్డి పేట : ఎల్లారెడ్డి పేట మండలంలో కొంతమంది బోరు బండ్ల యజమానులు వాల్ట చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకుని ఉల్టా పల్టా చేస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంట పొలాలు కోతలు ముగియగానే యదేచ్చగా మండలంలో కొత్త బోరు బావుల తవ్వకాలకు శ్రీకారం చుట్టారు. ప్రతి రోజూ ఒక్కో బోర్ బండి అయిదు కంటే మించి బోర్ పాయింట్లు వేస్తున్నారు. బోర్ పాయింట్ వేసే క్రమంలో బోర్ బండ్ల యజమానులు ఒక్కో ఫీట్ కు 45 రూపాయల నుండి 55 రూపాయల వరకు, కేసింగ్ పైపునకు సుమారు 500 రూపాయలకు పైగా రైతుల వద్ద నుంచి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు.
అనుమతులు లేకుండా తవ్వకాలు జరుపుతున్న బోర్ బండ్ల పై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఈ తతంగం అంతా వారి కనుసన్నల్లో జరుగుతుందనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఒక్క బోర్ పాయింట్ వేసే సమయంలో ముందుగా సదరు రైతు జియాలజిస్ట్, రెవెన్యూ అధికారుల అనుమతి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి డీడీ రూపంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. తదనంతరం జియలజిస్ట్, రెవెన్యూ అధికారులు బోర్ పాయింట్ వేసే స్థలాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించి బోర్ బావి తవ్వకానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇవి ఏవి పట్టకుండా సదరు బోర్ బండ్ల యజమానులు యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్న అడ్డుకోవాల్సిన అధికారులు వారికి అండగా ఉంటున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి.