తెరపైకి ‘వక్ఫ్’ భూములు.. హైడ్రా తరహ చర్యలు చేపట్టాలంటూ డిమాండ్!

రాష్ట్ర రాజధానిలో అన్యాక్రాంతమైన భూములను గుర్తిస్తూ అక్రమ కట్టడాలపై ప్రభుత్వం కొరడా ఝళిపించడంతో.. ఆ తరహా చర్యలకు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ లు వెల్లువెత్తుతున్నాయి.

Update: 2024-09-07 02:38 GMT

దిశ బ్యూరో, కరీంనగర్: రాష్ట్ర రాజధానిలో అన్యాక్రాంతమైన భూములను గుర్తిస్తూ అక్రమ కట్టడాలపై ప్రభుత్వం కొరడా ఝళిపించడంతో.. ఆ తరహా చర్యలకు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వక్ఫ్‌బోర్డు భూములను ఆక్రమించుకున్న వ్యవహారం పై ఆ తరహా చర్యలు ఉంటాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గతంలో కోర్టు తీర్పులను సైతం పక్కన పెట్టి అధికార యంత్రాంగం అప్పటి పాలకులకు వంతపాడటంతో భూముల అక్రమణ వెలుగులోకి వచ్చి దుమారం లేపినప్పటికి ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకపోగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వివాదాస్పదంగా మారింది. అయితే తాజాగా రాష్ట్ర రాజధానిలో చేపడుతున్న హైడ్రా తరహా చర్యలు ఉంటాయా అనే చర్చ జోరందుకుంది.

వక్ఫ్‌బోర్డు భూముల స్వాధీనానికి తీర్మానం పై చర్చ..

వర్షాకాల అసెంబ్లి సమావేశాల్లో అక్రమణకు గురైన వక్ఫ్‌బోర్డు భూముల పై చర్చకు వచ్చి వాటిని గుర్తించి స్వాధీనం చేసుకునేందుకు తీర్మానం చేయడంతో కరీంనగర్ జిల్లాలో అక్రమణకు గురైన వక్ఫ్‌బోర్డు భూముల పై ఆశలు చిగురించాయి. ప్రభుత్వం అసెంబ్లీలో సానుకూలంగా స్పందించి తీర్మానం చేయడం హైదరాబాద్ లో అక్రమణకు గురైన భూములపై చర్యలు చేపట్టడంతో ఇక వక్ఫ్‌బోర్డు భూములపై కూడా ప్రభుత్వం చర్యలు తప్పవనే వాదన వినిపిస్తుంది. అయితే గతంలో అక్రమణకు గురైన భూముల వివరాలు ఆధారాలతో అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అప్పటి నేతలకు వంతపాడిన అధికారులు ఇప్పుడు నూతన ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సానుకూలంగా వ్యవహరించి ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటారా లేక గత పాలకులకు వంతపాడి తప్పించుకుంటారా అనే చర్చ జిల్లాలో జోరందుకుంది.

సీఎం గ్రీన్ సిగ్నల్ తో ఆశలు..

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం వరద ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా అధికారులతో సమీక్షిస్తూ హైడ్రా తరహ చర్యలకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసుకోవావంటూ అధికారులకు సూచించడం .. అది పోలీస్ అధికారులకే బాధ్యతలను అప్పగించాలని సూచించడంతో ఇప్పటికే అక్రమ వ్యవహారాలపై కఠినంగా వ్యవహరిస్తున్న పోలీస్ బాస్ వక్ఫ్‌బోర్డు భూముల వ్యవహారంలో సైతం సీరియస్ గా స్పందిస్తాడంటూ ఊహగానాలు వినిపిస్తున్నాయి.


Similar News